మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్ : ఇటీవల హైదరాబాదులోని అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో చిన్నారి
బాలుడు మృతి చెందిన ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. బాలుడి
మృతి ఘటనతోనే తమ ప్రభుత్వం అలెర్ట్ కాదని, తాము ఎప్పటినుంచో వీధికుక్కల అంశంపై
చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మేయర్ వ్యాఖ్యలను రాజకీయం
చేస్తున్నారని మండిపడ్డారు. సమాజంలో మనుషులు ఎంత అవసరమో, జంతువులు కూడా అంతే
అవసరమని పేర్కొన్నారు. బాలుడి మృతి ఘటన ఏ విధంగా చూసినా బాధాకరమేనని తలసాని
అభిప్రాయపడ్డారు. బాలుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. ఈ ఘటన
నేపథ్యంలో ఎవరో విమర్శలు చేస్తూ సలహాలు ఇస్తే తాము తీసుకోబోమని, ఎలాంటి చర్యలు
తీసుకోవాలో తమకు తెలుసని స్పష్టం చేశారు. నగరంలో కుక్కల బెడద అధికంగా ఉందని
మంత్రి పేర్కొన్నారు. అయితే ప్రజల భద్రత, జీవాల సంరక్షణకు ప్రభుత్వం సమ
ప్రాధాన్యత ఇస్తుందని తలసాని స్పష్టం చేశారు. నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్
చేపట్టి కుక్కలకు స్టెరిలైజేషన్ నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్టు
వెల్లడించారు.