హైదరాబాద్ : సామాజిక, ఆర్థిక కులగణన- 2011లోని తెలంగాణ బీసీల వివరాలను
అందజేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్
వకుళాభరణం కృష్ణమోహన్‌రావు లేఖ రాశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం
తొలిసారిగా 2011లో అప్పటి యూపీఏ ప్రభుత్వం రూ.4,894కోట్లను వెచ్చించి
నాలుగేళ్లకుపైగా సమయం తీసుకుని దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించిందని తెలిపారు.
2015లో ఈ గణన వివరాలను పూర్తిస్థాయిలో బహిర్గతం చేయకుండా దేశంలో నాటికి 52శాతం
మాత్రమే బీసీలు ఉన్నారని కేంద్రం ప్రకటించిందని వెల్లడించారు.
అటు తర్వాత ఆ కులగణన నివేదికలో తప్పులు దొర్లాయని చెబుతూ మొత్తంగా ఆ రిపోర్టు
ఇప్పటివరకు బహిర్గతం చేయలేదని, ఇది దారుణమన్నారు. కేంద్రం అధికారికంగా కులగణన
వివరాలను అందిస్తే తెలంగాణ రాష్ట్రంలో అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలను మరింత
సమర్థవంతంగా, స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను కచ్చితంగా
నిర్ణయించుకోవడానికి ఎంతగానో దోహదపడతాయని వివరించారు. 2011నాటి సామాజిక,
ఆర్థిక కులగణన వివరాల్లో ఏమైనా తప్పులు దొర్లి ఉంటే, లోపాలను సరిదిద్ది అన్ని
రాష్ర్టాలకు అందిస్తే బీసీలకు ఎంతగానో మేలు జరుగుతుందని వివరించారు.
కానీ అలా కాకుండా కేంద్రం ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరిని అవలంభిస్తుందని
ఆరోపించారు. మహారాష్ట్ర విషయంలో కులగణణలో ఎక్కువగా తప్పులు దొర్లాయని కేంద్రం
గతంలో స్పష్టం చేసిందని, అలాగే ఇంకా ఏఏ రాష్ట్రాల్లో తప్పులున్నాయో స్పష్టం
చేయలేదని వెల్లడించారు. గతంలో కేంద్రం విజ్ఞప్తి మేరకు కొన్ని రాష్ట్రాలు తమ
రాష్ట్రాల నివేదికలోని వివరాలను తప్పులను సరిదిద్ది కేంద్రానికి నివేదించాయని
గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం విషయంలో మాత్రం ఎలాంటి తప్పులు దొర్లినట్లు
కేంద్రం ధ్రువీకరించిన దాఖలాలు లేవని, తిరిగి కులగణన చేసే ఉద్దేశం లేదని
ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో తెలంగాణ కులగణన వివరాలను అందించాలని
విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సుప్రీంకోర్టు పరిమాణాత్మక సమాచారంతో బీసీ
రిజర్వేషన్ల శాతాన్ని స్థిరీకరించుకుని, స్థానిక సంస్థలతో ఎన్నికలు
నిర్వహించాలని ఆదేశించిందని గుర్తుచేశారు. ఇకనైనా కులగణన వివరాలను అందజేయాలని
ప్రధాని నరేంద్ర మోడీకి బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం విజ్ఞప్తి చేశారు.