హైదరాబాద్ : మహబూబాబాద్ నియోజకవర్గంలో తన పాదయాత్రను అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై జరిగిన దాడి గురించి గవర్నర్ని కలవనున్నట్లు షర్మిల తెలిపారు. అసభ్య పదజాలం వాడడం వల్లే తాను స్పందించాల్సి వచ్చిందన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ అభ్యంతరకరంగా మాట్లాడారని విమర్శించారు. ఓ ఎమ్మెల్యే మాట్లాడాల్సిన పదమేనా అది.? అని మండిపడ్డారు. వాళ్లంటే తప్పులేదా.. మేమంటనే తప్పా? అని షర్మిల ప్రశ్నించారు. మహిళలు అంటే అంత చిన్న చూపా? ఆడవాళ్లు అయితే ప్రశ్నించకూడదా? అని నిలదీశారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఓ కబ్జా కోరు అని ఆరోపించారు.
మహబూబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా నుంచి కొజ్జాల్లా ఉండేవాళ్లు వలస వస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. వలసవాదులు తమ అవసరాల కోసం తెలంగాణలో పర్యటనలు చేస్తున్నారు అని అన్నారు. యాత్రల పేరుతో వచ్చే నాయకులు నోరు పారేసుకుంటే మానుకోట కంకర రాళ్లకు మరోసారి పని కల్పించాల్సి ఉంటుందని శంకర్ నాయక్ హెచ్చరించారు.