గిరిజన ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన ఆరాధ్యుడు
ఆయన ఆశయ స్ఫూర్తికి అనుగుణంగానే ముఖ్యమంత్రి కేసిఆర్ జనరంజక పాలన
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
బాల్కొండ : గిరిజన ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆయన్ను స్మరించుకున్నారు. బుధవారం బాల్కొండ నియోజకవర్గం మెండోర మండలం నడిమితండా గ్రామంలో 20 లక్షల వ్యయంతో నిర్మించే గ్రామ పంచాయతీ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం నడిమితండాలో గల జగదాంబ అమ్మవారు,సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా ఆలయంలో నిర్వహించిన హోమం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ గిరిజన ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడని,గొప్ప ఆధ్యాత్మిక గురువని అన్నారు. వారి ఆశీర్వాదం తో గిరిజన తండాలు పాడి పంటలతో అన్ని విధాల అభివృద్ది చెందాలని మంత్రి ఈ సందర్బంగా ప్రార్థించారు. సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశయాలకు అనుగుణంగానే రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ జనరంజక పాలన అందిస్తున్నారని అన్నారు. “మా రాజ్యంలో మా పాలన” కావాలన్న గిరిజనుల చిరకాలకోరిక మేరకు తండాలను గ్రామ పంచాయతీలు చేశారని,3,146 మంది గిరిజన బిడ్డలు సర్పంచ్ లు అయ్యారని తెలిపారు. వారి ఆత్మగౌరవాన్ని పెంచిన గొప్ప మనసున్న నాయకుడు కేసిఆర్ అని,తండాల్లో గ్రామ పంచాయతీల బిల్డింగ్ ల కోసం సుమారు 600కోట్లు ఖర్చు చేశారని మంత్రి ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు,తండా పెద్దలు, యువకులు పాల్గొన్నారు.