హైదరాబాద్ : దేశంలో ఎక్కడాలేని విదంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో
వెయ్యికి పైగా సంక్షేమ గురుకులాలు, వేలాది హాస్టళ్లను నిర్వహిస్తున్న విషయం
తెలిసిందే. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సన్న బియ్యం తో అత్యుత్తమ పోషణతో కూడిన
విద్యను ప్రభుత్వం అందిస్తుంది. గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వం
అనుసరిస్తున్న విధానాలతో పెరుగుతున్న ద్రవ్యోల్భణానికి అనుగుణంగా
విధ్యార్థులకు మరింత మెరుగైన పౌష్టికాహారం అందించడానికి రాష్ట్ర మంత్రులు
కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో
అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సంక్షేమ గురుకులాలు,
హాస్టళ్లలో మెస్ చార్జీల పెంపుపై చర్చించారు, విధ్యార్థులకు మెరుగైన
పౌష్టికాహారం అందించాలనే సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా శాఖా పరంగా
ప్రభుత్వానికి పంపించే ప్రతిపాదనలపై చర్చించారు. సంక్షేమ శాఖల బడ్జెట్లో మెస్
చార్జీల కేటాయింపులు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రులు
ఆదేశించారు. అనంతరం ముగ్గురు మంత్రులు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావును కలిసి
వివరించారు, సావదానంగా విన్న ఆర్థిక శాఖ మంత్రి ప్రాథమికంగా సానుకూలంగా
స్పందించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా
వెంకటేశం, ఎస్సీ సంక్షేమ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, గిరిజన సంక్షేమ శాఖ
కార్యదర్శి క్రిస్టినా చొంగ్డు, ఎస్సీ సంక్షేమ గురుకుల సొసైటీ కార్యదర్శి
రొనాల్డ్ రాస్, మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి షపీయుల్లా, ఎంజేపీ
సెక్రటరీ మల్లయ్య బట్టు తదితర అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్లో బీసీ సంక్షేమ శాఖకు 6229 కోట్లు,
పౌరసరఫరాల శాఖకు 3117 కోట్లు కేటాయించి, గతం కన్నా నిధులను పెంచిన సందర్భంగా
ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కి, రాష్ట్ర ప్రభుత్వానికి
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ధన్యవాదాలు
తెలిపారు.