హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో
పయనిస్తూ ఏటేటా బడ్జెట్ నిధులు పెంచుకుంటూ ప్రజల సమగ్ర సంక్షేమం, అభివృద్ధికి
పెద్ద పీట వేస్తూ ఈ ఏడాది 2,90,396 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టడం పట్ల రాష్ట్ర
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి
దయాకర్ రావు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కి
కృతజ్ణతలు, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ బడ్జెట్ లో 31,426 కోట్ల
రూపాయలు కేటాయించి పంచాయతీ రాజ్ శాఖకు సింహా భాగం కేటాయించడం పట్ల సీఎం
కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కి ధన్యవాదాలు తెలిపారు.
ఈ బడ్జెట్ పల్లెకు పట్టం కట్టిందని, ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతోందని మంత్రి
అభివర్ణించారు. అదేవిధంగా ఆసరా పెన్షన్లకు 12వేల కోట్ల రూపాయలు, మిషన్ భగీరథకు
600 కోట్ల రూపాయలు కేటాయించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ జాతిపిత మహాత్మా గాంధీ చెప్పిన పల్లెలు దేశానికి
పట్టుకొమ్మలు అన్న మాటలను ఆచరణలో అమలు చేస్తూ గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా
పల్లె ప్రగతి చేపట్టి తెలంగాణ పల్లెలను ప్రగతి కేంద్రాలుగా, స్వయం సమృద్దంగా
తయారు చేశారన్నారు. దేశానికి తెలంగాణ పల్లెలు రోల్ మోడల్ గా మారాయని,
అభివృద్ధిలో అందరితో పోటీ పడి మొదటి స్థానంలో నిలుస్తున్నాయని, జాతీయ,
అంతర్జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు పొంది తెలంగాణ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం
చేశాయి అన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ లో 13 జాతీయ అవార్డులు సాధించాం అన్నారు.
ప్రతి గ్రామంలో నేడు ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ పెట్టీ పారిశుధ్యానికి
అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్నారు. హరిత హారంలో భాగంగా 710 కోట్ల రూపాయలు ఖర్చు
చేసి నర్సరీలు ఏర్పాటు చేశామన్నారు. 238 కోట్ల రూపాయలతో పల్లె ప్రకృతి వనాలు
ఏర్పాటు చేశామని, 279 కోట్ల రూపాయలతో ప్రతి గ్రామానికి డంపింగ్ యార్డులు
నిర్మించి చెత్తనుంచి డబ్బులు సంపాదిస్తున్నామన్నారు. 1330 కోట్ల రూపాయలతో
వైకుంఠ ధామాలు నిర్మించి అంతిమ సంస్కారాలు గౌరవంగా జరుపుకునే అవకాశం
కల్పించామని తెలిపారు. ఈ విధంగా దాదాపు 10 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి
5 విడతల పల్లె ప్రగతిని విజయవంతంగా, రాష్ట్రం గర్వించేలా నిర్వహించాం అన్నారు.