శాసనసభ ఎన్నికలకు వెళ్లనున్న వేళ కీలకమైన చివరి బడ్జెట్ ఇవాళ ప్రవేశపెడుతోంది.అరుదుగా తొలిసారి ఫిబ్రవరి నెలలోనే రాష్ట్ర వార్షిక బడ్జెట్ వస్తోంది. రాష్ట్ర
ఆవిర్భావం మొదలు బడ్జెట్‌ను రూపొందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు
జీఆర్.రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారి రామకృష్ణారావు బృందం నేతృత్వంలో మరోమారు
బడ్జెట్ సిద్ధమైంది.
రానున్న ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఇవాళ
ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక శాఖా మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో శాసనసభ
వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మండలిలో బడ్జెట్ ప్రవేశపెడతారు
ఉదయం 10 గంటలా 30 నిమిషాలకు ఉభయ సభల సమావేశాల ప్రారంభంతో నేరుగా బడ్జెట్
ప్రసంగం ఉంటుంది. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు శాసనసభకు వచ్చే ముందు మంత్రి
హరీశ్‌రావు జూబ్లీహిల్స్ లోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
నిర్వహించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టిన కేసీఆర్
ప్రభుత్వం 11వ బడ్జెట్ ను ప్రవేశపెడుతోంది. ఇందులో 10 పూర్తిస్థాయి బడ్జెట్లు
కాగా ఒకటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్. 2018 ఎన్నికల అనంతరం 2019 లో రాష్ట్ర
ప్రభుత్వం మొదట ఓటాన్ అకౌంట్, ఆ తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది.
ఈ ఏడాది రాష్ట్ర శాసనసభ ఎన్నికల జరుగుతున్న వేళ మరోమారు బడ్జెట్
ప్రవేశపెడుతోంది. సాధారణంగా రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ప్రతి ఆర్థిక
సంవత్సరంలో మార్చి నెలలో ప్రవేశపెడుతుంటారు. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా
ఫిబ్రవరిలోనే ప్రవేశపెడుతున్నారు. నిరుడు మార్చి ఏడో తేదీన రాష్ట్ర బడ్జెట్
ప్రవేశపెట్టగా ఈ ఏడాది అంతకంటే నెల ముందే వార్షిక పద్దు వస్తోంది. ఫిబ్రవరిలో
బడ్జెట్ ప్రవేశ పెట్టడం అరుదైన సందర్భంగా చెప్తున్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం
2022-23 కు సవరించిన అంచనాలు, 2021 – 22 ఆర్థిక సంవత్సరం లెక్కలను రాష్ట్ర
ప్రభుత్వం ఉంచనుంది.
పలుదఫాల సమీక్షలు, సమావేశాల అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశానికి
అనుగుణంగా బడ్జెట్ సిద్ధమైంది. మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఆర్థికశాఖ
సుదీర్ఘ కసరత్తు చేసింది. ప్రతి ఏడాది లాగే రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనలో
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన
కార్యదర్శి రామకృష్ణారావు కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర ఆవిర్భావం మొదలు
అన్ని బడ్జెట్ ల తయారీలో వీరు క్రియాశీలకంగా ఉన్నారు. ఐఏఎస్ అధికారులు
రోనాల్డ్‌రోస్, శ్రీదేవి, విశ్రాంత ఐఏఎస్ శివశంకర్, ఆర్థికశాఖ అధికారులు,
ఉద్యోగులతో కూడిన బృందం బడ్జెట్ తయారు చేసింది.తొలిసారిగా రాష్ట్ర వార్షిక
ప్రణాళిక మూడు లక్షల కోట్ల మార్కును అధిగమించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం
రాబడులు విశ్లేషిస్తూ వచ్చే ఏడాది 15 శాతానికి పైగానే వృద్ధి ఉంటుందని అంచనా
వేసిన సర్కారు ఆ మేరకు ఆశావహ దృక్పథంతో బడ్జెట్ ప్రతిపాదనలను ఖరారు చేసినట్లు
సమాచారం.