హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీని దేశ వ్యాప్తంగా
విస్తరించే క్రమంలో భాగంగా బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి
కె.చంద్రశేఖర్ రావు ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలో
పర్యటించనున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో పలువురు ముఖ్యమంత్రులు, వివిధ
పార్టీల జాతీయ నేతల సమక్షంలో భారీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించిన
బిఆర్ఎస్ పార్టీ అదే దూకుడుతో ఇతర రాష్ట్రాల్లో పార్టీ కార్యక్రమాలను వేగవంతం
చేసింది. ఇటీవల ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ ఆధ్వర్యంలో తెలంగాణ
భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన పలువురు కీలక నాయకులు
బిఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా మాహారాష్ట్ర లోని నాంధేడ్ జిల్లాలో
పలువురు ముఖ్యులు, స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు భారీ ఎత్తున ఆదివారం సీఎం
కేసిఆర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లో చేరనున్నారు.
బీఆర్ఎస్ సభకు నాందేడ్ పట్టణం సర్వం సిద్ధమైంది. సభస్థలి వేదికను సర్వాంగ
సుందరంగా ముస్తాబు చేశారు. నాందేడ్ పట్టణంతో పాటు సభస్థలికి నలుదిక్కులా
కిలోమీటర్ల మేర ఆ ప్రాంతమంతా గులాబీమయంగా మారింది. వరుస క్రమంలో ఏర్పాటు
చేసిన భారీ హోర్డింగులు, బెలూన్లు, స్టిక్కర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
మహారాష్ట్రలోని నాందేడ్ లో ఆదివారం జరపతలపెట్టిన బీఆర్ఎస్ సభకు అవసరమైన
అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అధ్యక్షులు, సీయం
కేసీఆర్ సభకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. బీఆర్ఎస్ పార్టీ రూపాంతరం
చెందిన తర్వాత జాతీయస్థాయిలో జరుగుతున్న తొలి సభ కావడంతో
ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లను చేశారు. అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ
శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్ , ప్రభుత్వ విప్ బాల్క
సుమన్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, షకీల్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి
బాలమల్లు, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, తదితర
నేతలు గత కొన్ని రోజులుగా ఇక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
సభ ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలో ఆదివారం సీయం కేసీఆర్ సభ
నేపథ్యంలో అన్ని ఏర్పాటు పూర్తి చేసినట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
పేర్కొన్నారు. సభకు హాజరవుతున్న ప్రజానీకం ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగిన
ఏర్పాట్లు చేశామన్నారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, టీఎస్ఐఐసీ చైర్మన్
గ్యాదరి బాలమల్లుతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సభ ప్రాంగణాన్ని
సందర్శించి, ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాలినడకన మైదానమంతా
కలియతిరిగారు. సభా వేదిక అలంకరణ, అతిధులు, ముఖ్య నేతల సీటింగ్ పై నేతలకు
దిశా నిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్ పర్యటనపై మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లొ,
వివిధ పార్టీల నాయకుల్లో, మీడియాలో చర్చ జరుగుతున్నది. నాందేడ్ లో సీఎం
కేసీఆర్ గారు పాల్గొనే గురుద్వార , బి.ఆర్.ఎస్ చేరికల సభ , సిటీ ప్రైడ్ హోటల్
లో జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్ కార్యక్రమాలు ఎలక్ట్రానికి మీడియా కు లైవ్
ప్రసారం అందించబడుతుంది.