హైదరాబాద్ : బీఆర్ఎస్ ప్రభుత్వానిది కుటుంబ పాలనంటూ ప్రతిపక్షాలు చేసే
విమర్శలకు మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. తమది కుటుంబ పాలనే
అని, రాష్ట్రంలోని 4 కోట్ల మంది తమ కుటుంబమని స్పష్టం చేశారు. తెలంగాణతో సీఎం
కేసీఆర్‌కు ఉన్న బంధాన్ని ఎవరూ విడదీయలేరన్న మంత్రి తమ ప్రభుత్వంలో పల్లె
మురిసిపోతుంది, పట్టణం మెరిసిపోతుందని వివరించారు.
తెలంగాణతో సీఎం కేసీఆర్‌కు ఉన్న బంధాన్ని ఎవరూ విడదీయలేరని ఐటీ, పరిశ్రమల శాఖల
మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని ప్రతి
పల్లె మురిసిపోతుందని, పట్టణం మెరిసిపోతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర
ప్రగతిని మెచ్చి ఢిల్లీలో ఉన్నోళ్లు అవార్డులు ఇస్తుంటే గల్లీలో ఉన్నోళ్లు
విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే
తీర్మానంపై శాసనసభలో చర్చ ముగియగా చర్చకు మంత్రి కేటీఆర్ ఈ మేరకు సమాధానం
ఇచ్చారు. ఈ సందర్భంగా కుటుంబ పాలనంటూ వచ్చే విమర్శలకు మంత్రి కేటీఆర్ గట్టి
కౌంటర్ ఇచ్చారు. తమ ప్రభుత్వానిది కుటుంబ పాలనే అని, రాష్ట్రంలోని 4 కోట్ల
మంది తమ కుటుంబం అని పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులతో తమది
పేగుబంధమని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికులకు ఉద్యోగ పదవీ విరమణ వయసు 61
ఏళ్లకు పెంచామన్న కేటీఆర్ ఐటీఆర్‌ను కేంద్రం రద్దు చేసినా తెలంగాణ మాత్రం
ఉజ్వలంగా ముందుకెళ్తుందని తెలిపారు. దేశం మెుత్తం మీద 4 లక్షల ఐటీ ఉద్యోగాలు
వస్తే మూడో వంతు ఉద్యోగాలు తెలంగాణలోనే వచ్చాయని స్పష్టం చేశారు. చాక్లెట్
నుంచి రాకెట్ వరకు ప్రతి పరిశ్రమకు గమ్యస్థానం తెలంగాణే అన్న ఆయన వరల్డ్
గ్రీన్ సిటీగా హైదరాబాద్ నిలిచిందని వివరించారు.
”తెలంగాణతో కేసీఆర్‌కు ఉన్న బంధాన్ని ఎవరూ విడదీయలేరు. మా ప్రభుత్వానిది
కుటుంబపాలనే. 4 కోట్ల మంది మా కుటుంబం. ఉద్యోగులతో మాకున్నది పేగుబంధం. మా
ప్రభుత్వంలో పల్లె మురిసిపోతుంది, పట్టణం మెరిసిపోతుంది. మిషన్ భగీరథను హర్
ఘర్ జల్ పేరుతో కేంద్రం కాపీ కొట్టింది. రాష్ట్ర పథకాలను, ప్రగతిని మెచ్చి
ఢిల్లీలో ఉన్నోళ్లు అవార్డులు ఇస్తుంటే గల్లీలో ఉన్నోళ్లు విమర్శలు
చేస్తున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.