హైదరాబాద్ : మన దేశంలో ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయని తెలంగాణ ఐటీ
శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. భారత్ 60 శాతం జనాభా యువకులదే అన్న కేటీఆర్
యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూనే ఉందన్నారు. అసలు ఎవరో ఉద్యోగాలు
సృష్టిస్తారని ఎదురుచూడటం ఎందుకని, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఎందుకు
మనం ఆలోచన చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీ ఆధ్వర్యంలో
నిర్వహించిన ‘డీకోడ్ ది ఫ్యూచర్’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో మాట్లాడిన
కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆవిష్కరణలు చేస్తూ చిన్న దేశాలు ముందుకు
వెళ్తున్నాయని, హైదరాబాద్ కంటే చిన్నదైన సింగపూర్ ఆర్ధిక వ్యవస్థ విషయంలో
వేగంగా ముందుకెళుతోందన్నారు. మనం ఎందుకు ఇంకా ఇక్కడే ఉన్నామో
ప్రశ్నించుకోవాలన్నారు. విదేశాల మాదిరిగా ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెడితే
భారత్ నంబర్ వన్ దేశంగా ఎదుగుతుందని అభిప్రాయపడ్డారు.
దేశంలో ఎంతో మంది గొప్పవారు, తెలివైన నేతలున్నారన్నారు. కానీ, భారత్ లో ఆర్థిక
అభివృద్ధి కన్నా రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెడతారని మంత్రి కేటీఆర్
వ్యాఖ్యానించారు. మెరుగైన ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్ తరాలకు మనకన్నా మంచి
భవితను అందించే అంశాలపై నేతలు దృష్టి పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో ఏడాదంతా ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయని, నాయకుల దృష్టంతా
ఎన్నికలపైనే ఉంటుందని అన్నారు. దేశంలో ఇప్పుడున్న ప్రధాన సమస్య ఇదేనని కేటీఆర్
అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో దేశ అభివృద్ధి కోసం కేటాయింపులు
చేసినట్లు ఎక్కడా కనిపించలేదని విమర్శించారు. ఇక, దేశ అభివృద్ధిలో తెలంగాణ
పాత్ర గణనీయమైనదని కేటీఆర్ చెప్పారు. దేశ జీడీపీలో 5 శాతం వాటా
రాష్ట్రానిదేనన్నారు.