హైదరాబాద్ : క్రిస్టియన్ మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం కోసం తెలంగాణా రాష్ట్ర
ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల
అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
మంగళవారం నారాయణగూడ లోని చర్చిలో జరిగిన యునైటెడ్ క్రిస్టియన్స్ పాస్టర్స్
సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని
జిల్లాలకు చెందిన చర్చి కమిటీ సభ్యులు, పాస్టర్ లు, బిషప్ లు పాల్గొన్నారు. ఈ
సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఐక్యత తోనే అభివృద్ధి సాధించగలం అనే విషయాన్ని
గుర్తించి రాష్ట్రంలోని క్రిస్టియన్ మైనార్టీలు అంతా ఒకటి కావాల్సిన అవసరం
ఉందని చెప్పారు. అన్ని జిల్లాలు, మండలాల వారిగా కమిటీ లను ఏర్పాటు చేసుకొంటే
సమస్యలను పరిష్కరించుకొనే అవకాశం ఉంటుందని, ఈ కమిటీల ద్వారా ప్రభుత్వం అమలు
చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన వారికి అందించవచ్చని అన్నారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అమలు
అవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా అమలు కావడంలేదని
స్పష్టం చేశారు. క్రిస్టియన్ ల ఆత్మగౌరవాన్ని మరింత పెంపొందించే విధంగా ఉప్పల్
భగాయత్ లో 2 ఎకరాల భూమి, 10 కోట్ల రూపాయలను క్రిస్టియన్ భవనం నిర్మాణం కోసం
ప్రభుత్వం ఇచ్చిందని పేర్కొన్నారు. పేదింటి ఆడపడుచు పెండ్లి కోసం షాదీ ముబారక్
క్రింద ఒక లక్ష 116 రూపాయల ఆర్ధిక సహాయం, విదేశాలలో ఉన్నత విద్య కోసం 20 లక్షల
రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అదేవిధంగా నాణ్యమైన
విద్య, వసతి సౌకర్యాలతో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేసిన
విషయాన్ని వివరించారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
అదేవిధంగా మైనార్టీ కార్పోరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు సబ్సిడీ పై రుణాలను
అందిస్తున్నట్లు తెలిపారు. ఇవే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత
ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ ను కూడా ఎంతో ఘానంగా నిర్వహిస్తున్న
విషయాన్ని గుర్తుచేశారు. పేద లు సైతం పండుగను సంతోషంగా, గొప్పగా జరుపుకోవాలనే
ఉద్దేశంతో నూతన వస్త్రాలతో కూడిన గిఫ్ట్ ప్యాక్ లను దేశంలో ఎక్కడా లేని విధంగా
అందజేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ విందు ఏర్పాటు
చేస్తున్నట్లు తెలిపారు. చర్చిల అభివృద్ధి, మరమ్మతులకు కూడా ప్రభుత్వం
ప్రత్యేకంగా నిధులు అందిస్తున్నట్లు చెప్పారు. గ్రేవ్ యార్డ్ ల కోసం స్థలాలను
కూడా కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 10 ప్రాంతాలలో 42 ఎకరాల భూమిని
గుర్తించడం జరిగిందని, త్వరలోనే పంపిణీ చేయనున్నట్లు వివరించారు. తెలంగాణ
ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుందని చెప్పారు. దేశంలో
అనేక చోట్ల కులాలు, మతాల పేరుతో రాజకీయాలు జరుగుతున్నాయని, తెలంగాణా
రాష్ట్రంలో అలాంటి వాటికి చోటుండదని స్పష్టం చేశారు. శాంతిభద్రతల నిర్వహణ లో
తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానంలో ఉంటుందన్నారు.