హైదరాబాద్ : రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా ప్రజలకు
అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ను స్థాపించారని అటవీ,
పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
మహారాష్ట్రలో నాందేడ్ సభ సన్నాహకాల్లో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
శనివారం నాందేడ్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. అప్పారావు పేట్, షివిని,
ఇస్లాపూర్, హిమాయత్ నగర్ గ్రామాల్లో కలియ తిరిగారు. మంత్రి ఇంద్రకరణ్
రెడ్డికి స్థానిక ప్రజలు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. కాలనీల్లోకి
వెళ్ళి వృద్దులతో ముచ్చటించారు. మహారాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని
పట్టించుకోవడం లేదని, ఫించన్లు కూడా రావడం లేదని, గూడుకు కూడా
నోచుకోవడం లేదని, మంచి సౌలత్లు లేవని మహిళలు, వృద్దులు మంత్రి ముందు
వాపోయారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను మాక్కూడా అమలు
చేయాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ దేశ వ్యాప్తంగా తెలంగాణ
తరహాలో సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు సీయం కేసీఆర్ బీఆర్ఎస్ జాతీయ
పార్టీని స్థాపించారని వ్యాఖ్యానించారు. నాందేడ్ సభకు భారీగా తరలి
వచ్చి విజయవంతం చేయాలని కోరారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
మాట్లాడుతూ తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర, కర్నాటక,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రజలు తెలంగాణ మోడల్ అభివృద్ధి, సంక్షేమ
పథకాలు కావాలని కోరుకుంటున్నారని అన్నారు. ఎక్కడికి వెళ్ళినా అదే
విషయాన్ని ప్రస్తావిస్తున్నారని, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు,
రైతుబీమా, ఉచిత కరెంటు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఫించన్లు, పేదలకు
డబుల్ బెడ్ రూం ఇండ్లు వంటి అనేక పథకాలను మాక్కూడా కావాలని కోరుతున్నారని
చెప్పారు.