హైదరాబాద్ : భారతదేశ యువతలో అపారమైన శక్తి సామర్థ్యాలున్నాయని అందుకే
వినూత్నమైన, సృజనాత్మకమైన ఆలోచనలతో ఉద్యోగాల కోసం వేచిచూడటం నుంచి ఉద్యోగాలు
సృష్టించే స్థితికి మన దేశ యువత ముందుకెళ్తోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక,
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న భారతదేశం రానున్న
రోజుల్లో ఈ దిశగా మరింత పురోగతి సాధించేలా కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మక
కార్యాచరణ రూపొందించిందని ఆయన అన్నారు. శనివారం హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ
హోటల్ లో జీ-20 స్టార్టప్ ఎంగేజ్మెంట్ గ్రూప్ సమావేశాలకు కేంద్ర మంత్రి కిషన్
రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘స్టార్టప్ ల సదస్సుకు
భారతదేశం సరైన వేదిక. భారతదేశంలో దాదాపు 85వేల రిజిస్టర్డ్ స్టార్టప్
కంపెనీలున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ భారత్ సొంతం.
దేశంలో 350 బిలియన్ డాలర్ల విలువ చేసే వందకు పైగా స్టార్టప్స్ ఉన్నాయి.
ప్రపంచంలో మూడో అతిపెద్ద యూనికార్న్ వ్యవస్థగా భారతదేశం నిలిచింది. ఇది గత
కొంతకాలంగా దేశం ఈ రంగంలో సాధిస్తున్న విజయాలకు ఒక ఉదాహరణ మాత్రమే’ అని కిషన్
రెడ్డి పేర్కొన్నారు. భారత దేశానికి యువ జనాభాయే బలమైన ఆస్తి అన్న కిషన్
రెడ్డి దేశ యువత తమ శక్తి సామర్థ్యాలను సద్వినియోగ పరుస్తూ దేశ భవిష్యత్తును
ఉజ్వలంగా మార్చేందుకు వినూత్నమైన ఆలోచనలతో ముందుకెళ్తోందన్నారు. సరికొత్త
సాంకేతికతతో, సృజనాత్మకమైన ఐడియాలతోపాటు చిత్తశుద్ధితో మన యువత చేస్తున్న కృషి
కారణంగానే ఇవాళ భారతదేశం స్టార్టప్ ల రంగంలో ప్రపంచంలో తనకంటూ సుస్థిరమైన
స్థానాన్ని ఏర్పాటుచేసుకుందని కేంద్ర మంత్రి అన్నారు. భారత యువతను
ప్రోత్సహించేందుకు, స్టార్టప్ ల రంగానికి మరింత చేయూతనందించేందుకు కేంద్ర
ప్రభుత్వం ‘ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్’, ‘స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్
స్కీమ్’ వంటి పథకాలను తీసుకొచ్చిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరగడం కూడా స్టార్టప్ లకు
ప్రోత్సాహకరంగా ఉందని ఆయన అన్నారు. భారతదేశంలో రాజకీయ, ఆర్థిక స్థిరత్వం
కారణంగా మరిన్ని ఎఫ్ డీ ఐ లు వస్తున్నాయన్నారు. దీని కారణంగా వచ్చే 25 ఏళ్లలో
(అమృత కాలంలో) భారతదేశంలో స్టార్టప్ లు మరింతగా వృద్ధి చెంది.. భారతదేశ
జీడీపీలో కీలకం అవుతాయని ఆయన అన్నారు. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా
విశ్వాస్’ నినాదంతో అందరికీ అభివృద్ధి ఫలాలు అందించేందుకు, డిజిటల్ మౌలికవసతుల
కల్పనకు, డీ-కార్బనైజేషన్ (పర్యావరణ పరిరక్షణ కోసం హరిత, పునరుత్పాదక విద్యుత్
వినియోగం పెరిగేలా) తదితర ప్రక్రియలపై ప్రత్యేక విధానతో భారత స్టార్టప్ లు
పనిచేస్తున్నాయని, విద్యతోపాటు, వైద్యం, వ్యవసాయంలోనూ వినూత్నమైన పరిశోధనలు
జరుగుతున్నాయని ఆయన అన్నారు.