హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ, ప్రపంచవ్యాప్త ప్రకృతినిధి సంస్థ
సంయుక్తంగా అటవీ అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.
తొలి దశలో అమ్రాబాద్, కవాల్ టైగర్ రిజర్వు పరిధిలో క్షేత్ర స్థాయిలో పనిచేసే
అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి అగ్ని ప్రమాదాల నివారణపై సదస్సు నిర్వహించారు.
నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్- బెంగుళూరుకు చెందిన డాక్టర్ జయశ్రీ
రత్నం అడవుల్లో రగిలే కార్చిచ్చు, యాజమాన్య పద్దతులు అనే అంశంపై అవగాహన
సదస్సును అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధి అచ్చంపేటలో నిర్వహించారు. ఈ సదస్సులో
డాక్టర్ జయశ్రీ మాట్లాడుతూ నల్లమల అడవుల ప్రాంతాన్ని మెసిక్ సవాన్నాగా
పిలుస్తారని, చెట్లు, విశాలమైన పచ్చిక బయలు కలిగి ఉంటాయన్నారు. తక్కువ
వర్షపాతం నమోదయ్యే ఆకురాల్చు అడవులలో ఇక్కడ పర్యావరణ ఉంటుందని తెలిపారు. మానవ
ప్రమేయం, ప్రాకృతిక కారణాలతో అటవీ అగ్ని ప్రమాదాలు (కార్చిచ్చు) రగులుతుందని
పేర్కొన్నారు. అడవుల్లో మంటలు అనేవి ప్రమాదకరం అయినప్పటికీ పరిమిత ప్రదేశంలో
కంట్రోల్ బర్నింగ్ అడవికి ఉపయోగకరమని అన్నారు. దీని వల్ల అడవుల్లో కొత్త జీవ
వైవిధ్యం అభివృద్ధి చెందడంలో ఉపయోగపడతాయని, కార్చిచ్చు రగలగానే ఆందోళన
చెందకుండా, దశల వారీగా మంటలను అదుపుచేస్తూ అటవీశాఖ అధికారులు సమన్వయంతో
పనిచేయాలని తద్వారా అధిక నష్టం వాటిల్లకుండా చేయొచ్చని సూచించారు. అటవీ అగ్ని
ప్రమాదాల విషయంలో సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక యంత్ర సామాగ్రి వాడకంపై
సమావేశంలో చర్చించారు. అటవీ సమీప గ్రామాలు, ఆవాసాల్లో నివసించే వారిని నిత్యం
అప్రమత్తం చేయాలని, అడవుల గుండా వెళ్లే రహదారుల్లో ప్రయాణీకులు ఆర్పని
సిగరెట్, బీడీ విసరటం, వంటలు చేయటం లాంటివి నిరోధించాలని, వారికి సరైన అవగాహన
కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ నుండి సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్
డాక్టర్ అశోక్ కుమార్, సీనియర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అక్బర్ షరీఫ్, యోగేష్ పసూల్,
యాంటీ పొచింగ్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఎఫ్ డీవో శ్రీనివాస్, రేంజ్ అధికారులు
ఆదిత్య, రాజేందర్, ఈశ్వర్, శరత్ చంద్ర ,వీరేశం, ముజీబ్ ఘోరి, కాశన్న,
అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ సర్కిళ్ల అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.