హైదరాబాద్ : ఎనిమిదో నిజాం ముకర్రం ఝా పార్థివ దేహం హైదరాబాద్ చేరుకుంది.
ఇస్తాంబుల్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన భౌతికకాయాన్ని శంషాబాద్‌కు
తీసుకొచ్చారు. అక్కడి నుంచి చౌమహల్లా ప్యాలెస్‌కు తరలించారు. ఇవాళ నిజాం
కుటుంబీకులు, బంధువులకు మాత్రమే చూసేందుకు అనుమతిచ్చారు. రేపు ఉదయం 8 నుంచి
మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిజాం అభిమానులు.. ముకర్రం ఝా పార్థివదేహాన్ని
చూసేందుకు అనుమతించనున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం
కానుంది. చౌమహల్లా ప్యాలెస్ నుంచి మక్కామసీదు వరకు యాత్ర కొనసాగనుంది. తన
పూర్వీకులైన నిజాం సమాధుల పక్కనే ముకర్రం ఝా పార్థివ దేహాన్ని ఖననం
చేయనున్నారు. ఏడో నిజాం మీర్ఉస్మాన్ అలీఖాన్ మనవడు, చివరి నిజాం ప్రిన్స్
మీర్ అలీఖాన్ ముకర్రమ్ ఝా బహదూర్ (మీర్ బరాకత్ అలీఖాన్) (89) శనివారం
అర్ధరాత్రి ఇస్తాంబుల్‌లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
సీఎం కేసీఆర్ నివాళి : చౌమహల్లా ప్యాలస్‌లోని ముకర్రం ఝా పార్థివ దేహానికి
సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. ముకర్రం భౌతిక కాయాన్ని సందర్శించి కుటుంబ
సభ్యులను ఓదార్చారు. నివాళులర్పించిన వారిలో మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి,
మహమూద్ ఆలీ, ఎంపీ సంతోష్ తదితరులు ఉన్నారు.