హైదరాబాద్ : ఉప్పల్ వేదికగా బుధవారం జరగనున్న భారత్-న్యూజిలాండ్ వన్డే
మ్యాచ్ నేపథ్యంలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సీపీ చౌహాన్
వెల్లడించారు. 2500 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నామన్నారు. మంగళవారం ఆయన
మీడియాతో మాట్లాడుతూ.. మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టేడియంలోకి ప్రేక్షకులను
పంపిస్తామన్నారు. సెల్ఫోన్ మినహా మరే ఇతర వస్తువులను మైదానంలోకి
అనుమతించబోమని స్పష్టం చేశారు. పాసులు, బీసీసీఐ కార్డులు ఉన్నవారు మాత్రమే
స్టేడియానికి రావాలని కోరారు. మైదానంలోకి వెళ్లి క్రికెటర్లను అడ్డుకుంటే కఠిన
చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా పార్కింగ్ ఏర్పాట్లు
చేశామని, మహిళల కోసం 40 మందితో షీ టీమ్లు ఏర్పాటు చేశామని చెప్పారు. మ్యాచ్
టికెట్లను బ్లాక్లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. క్రికెట్
బెట్టింగ్, బ్లాక్ టికెట్లపై ప్రత్యేక నిఘా పెట్టామని చెప్పిన ఆయన బ్లాక్
టికెట్ల విక్రయాలపై ఇప్పటికే 3 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. బుధవారం
మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.