ఏర్పాటు చేసేందుకు అపోలో టైర్స్ ముందుకొచ్చింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో
ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన
కొనసాగుతోంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో డిజిటల్
ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభించనున్నట్లు అపోలో టైర్స్ లిమిటెడ్ ప్రకటించింది.
లండన్ తరువాత తమ రెండో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను హైదరాబాద్‌లోనే ఏర్పాటు
చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక
సదస్సు సందర్భంగా మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున పరిశ్రమల
శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, అపోలో టైర్స్ లిమిటెడ్ వీసీ, ఎండీ నీరజ్
కన్వర్ ఒప్పందం చేసుకున్నారు.నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగంగా కంపెనీ డిజిటల్ వ్యూహాలైన ఐవోటీ, క్లౌడ్
కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్ ప్రాసెస్
ఆటోమేషన్, బ్లాక్ చైన్ వంటి వినూత్న సాంకేతికతలను ఉపయోగించుకుని, కొత్త
వ్యాపార నమూనాలను అభివృద్ధి చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. వినియోగదారులకు
మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో ఈ డిజిటల్ ఇన్నోవేషన్ కేంద్రం ప్రధాన
పాత్ర పోషిస్తుందని పేర్కొంది. మార్కెటింగ్, తయారీ సామర్థ్యాలను
పెంపొందించుకోవడంతో పాటు కంపెనీ సప్లై చైన్‌ను మరింత సమర్థంగా ఉపయోగించుకుని
అనుకున్న లక్ష్యాలను సాధించడంలో ఈ కేంద్రం కీలకపాత్ర పోషిస్తుందని తెలిపింది.
అపోలో టైర్స్ భవిష్యత్ ప్రణాళికల సాధన కోసం డిజిటలైజేషన్ ఎంతో కీలకమని,
లండన్ తరువాత హైదరాబాద్‌లో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం సంస్థ
డిజిటల్ వ్యూహంలో భాగమని వెల్లడించింది. ఇందుకోసం సహకరించిన తెలంగాణ
ప్రభుత్వానికి అపోలో టైర్స్ లిమిటెడ్ వీసీ, ఎండీ నీరజ్ కన్వర్ కృతజ్ఞతలు
తెలిపారు.
రూ.750 కోట్లతో లిథియం క్యాథోడ్ మెటీరియల్ తయారీ కేంద్రం : తెలంగాణలో మల్టీ
గిగావాట్ లిథియం క్యాథోడ్ మెటీరియల్ తయారీ కేంద్రం ఏర్పాటు కానుంది. బ్యాటరీల
తయారీలో అంతర్జాతీయంగా ఎంతో పేరున్న అలాక్స్ అడ్వాన్స్ మెటీరియల్స్ ప్రైవేట్
లిమిటెడ్ రూ.750 కోట్లతో ఈ కేంద్రాన్ని నెలకొల్పనుంది. లిథియం ఐరన్ ఫాస్పేట్
యాక్టివ్ బ్యాటరీలను ఈ కేంద్రంలో ఉత్పత్తి చేయనున్నారు. దావోస్‌లో మంత్రి
కేటీఆర్ సమక్షంలో అలాక్స్ సంస్థ ప్రతినిధులు ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో
అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు. మొదట రూ. 210 కోట్ల పెట్టుబడితో మూడు
గిగావాట్ల సామర్థ్యంతో లిథియం ఐరన్ ఫాస్పేట్ బ్యాటరీలను ఉత్పత్తి చేయనున్నట్లు
అలాక్స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో 10 గిగావాట్ల
సామర్థ్యానికి పెంచి 2030 నాటికి మొత్తంగా రూ.750 కోట్లు పెట్టుబడిగా
పెట్టనున్నట్లు తెలిపారు. ప్రతిపాదిత తయారీ కేంద్రంతో సుమారు 600 మంది
అత్యుత్తమ నైపుణ్యం కలిగిన నిపుణులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని చెప్పారు.
రాష్ట్రంలో తయారీ ప్లాంటు ఏర్పాటుకు అలాక్స్ సంస్థ ముందుకు రావడం పట్ల మంత్రి
కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రజలకు మరింత చేరువ
చేసేందుకు అవకాశం ఉందన్నారు.