ప్రధాని నరేంద్ర మోడీ కి తెలంగాణ మంత్రి కేటీఆర్ సూటి ప్రశ్న
దావోస్ వేదికగా ప్రధాని మోదీని ప్రశ్నించిన కేటీఆర్
అప్పులు తెచ్చి పెట్టుబడులు పెడితే తప్పులేదని వివరణ
కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులపై వివరణ ఇవ్వాలని డిమాండ్
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం స్విట్జర్లాండ్ చేరుకున్న మంత్రి కేటీఆర్
‘అభివృద్ధి కోసం, లాభాలు ఆర్జించే రీతిలో పెట్టుబడి పెట్టేందుకు అప్పులు
చేయడంలో తప్పులేదు. పెట్టుబడులతో ప్రతిపైసా లాభంతో తిరిగొస్తుంది. అయితే,
తెచ్చిన అప్పులను ఏం చేశామన్నదే ముఖ్యం’ అని తెలంగాణ మంత్రి కేటీఆర్
పేర్కొన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం మంత్రులు, ప్రతినిధులతో కలిసి
ఆయన స్విట్జర్లాండ్ లోని దావోస్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐలతో
జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వంద లక్షల కోట్ల అప్పు
చేసిందని, ఆ సొమ్మును దేనికి ఖర్చు పెట్టారో చెప్పాలని మోడీని ప్రశ్నించారు.
గత 14 మంది ప్రధానులు రూ.56 లక్షల కోట్లు అప్పులు చేస్తే ప్రధాని మోదీ ఒక్కరే
వంద లక్షల కోట్ల అప్పులు చేశారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం
చేసిన అప్పులపై నిలదీసే అర్హత బీజేపీకి లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం
చేసిన ప్రతీ పైసా అప్పుకు తగిన ప్రతిఫలం రాబడుతుందని వివరించారు. అప్పులు చేసి
తీసుకొచ్చిన సొమ్మును తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులపై, రాష్ట్ర అభివృద్ధిపై
ఖర్చు చేసిందని వివరించారు. దీని ప్రతిఫలాలు ఇప్పటికే అందుకుంటున్నామని,
ముందుముందు మరిన్ని లాభాలను రాష్ట్ర ప్రభుత్వం ఆర్జిస్తుందని వివరించారు.