హైదరాబాద్ : సస్పెండైన రెవెన్యూ ఇన్స్పెక్టర్తో కలిసి ఎన్నారైని మోసం చేసిన
అంబర్‌పేట సీఐని వనస్థలిపురం పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మరోవైపు
అరెస్టయిన ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్
ఆదేశాలు జారీ చేశారు. వనస్థలిపురం సీఐ కోల సత్యనారాయణ వివరాల ప్రకారం..
వనస్థలిపురం ఎస్కేడీనగర్లో నివాసముండే కర్ణాటి రాజేశ్ రెవెన్యూ
ఇన్స్పెక్టర్గా పని చేశాడు. నాలుగేండ్ల క్రితం యాచారం మండలంలో పని చేస్తున్న
సమయంలో అక్రమాలకు పాల్పడటంతో అధికారులు సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి రియల్
ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇదే క్రమంలో ప్రస్తుతం అంబర్పేట్ సీఐగా పని
చేస్తున్న పెరం సుధాకర్‌తో పరిచయం ఏర్పడి, స్నేహితులుగా మారారు. చింతల్‌కుంటకు
చెందిన విజయంత్గౌడ్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. అతనికి రాజేశ్‌తో
పరిచయం ఏర్పడింది. దీంతో రంగారెడ్డి జిల్లా కందుకూరులో సర్వే నంబర్ 54/2లోని
10 ఎకరాల వ్యవసాయ స్థలం తమకు తెలిసిన వాళ్లదని, దాని విలువ రూ.4.50 కోట్లు
ఉంటుందని విజయంత్ను నమ్మించాడు. ఆ స్థలానికి సంబంధించిన నకిలీ డాక్యుమెంట్లను
సృష్టించాడు. వారి మాటలు నమ్మి, నిరుడు ఫిబ్రవరి నెలలో ఆ పొలాన్ని కొనేందుకు
విజయంత్గౌడ్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. అడ్వాన్స్‌గా నగదు రూ.5 లక్షలు
ఇచ్చాడు. మరో రూ. 50 లక్షలు ఆన్లైన్లో రాజేశ్ ఖాతాకు పంపించాడు. కాగా, ఈ
ల్యాండ్‌కు సంబంధించిన విషయంలో విజయంత్తో రాజేశ్, సీఐ సుధాకర్ కూడా చర్చలు
జరిపాడు.
ఏసీబీకి చిక్కిన బహదూర్‌పుర ఎస్సై శ్రావణ్
బాధితుడి నుంచి లంచం డిమాండ్ చేసిన బహదూర్‌పుర ఎస్సై శ్రావణ్‌ను ఏబీసీ
అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారి ఫయాజ్ వివరాల ప్రకారం.. బహదూర్‌పుర
పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసించే ఓ వ్యక్తి ఫైనాన్స్‌లో బైక్ తీసుకొని,
కొన్ని నెలల తర్వాత డబ్బులు చెల్లించలేదు. ఫైనాన్స్ నిర్వాహకులు వాహనాన్ని
సీజ్ చేసి, ఎస్సై శ్రావణ్‌కు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా బాధితుడి
సెల్‌ఫోన్‌ను ఎస్సై స్వాధీనం చేసుకున్నాడు. ఫైనాన్స్ క్లియర్ చేసిన బాధితుడు
బైక్‌ను తీసుకున్నాడు. సెల్‌ఫోన్ కోసం వెళ్తే ఎస్సై శ్రావణ్ రూ.20 వేలు
డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రూ.8 వేలు
చెల్లిస్తానని పథకం ప్రకారం ఒప్పందం చేసుకొని శుక్రవారం ఎస్సైకి ఇచ్చాడు.
మాటువేసిన ఏసీబీ అధికారులు శ్రావణ్ వద్ద నుంచి డబ్బులు స్వాధీనం చేసుకొని,
ఎస్సైని అదుపులోకి తీసుకొని ఏసీబీ న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు.