మహబూబాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన ప్రారంభమైంది. మహబూబాబాద్ చేరుకున్న కేసీఆర్‌కు మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అనంతరం సీఎం నూతనంగా నిర్మించిన కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ శాఖలన్నీ ఒకేచోట కొలువుదీరి ప్రజలకు పారదర్శక
సేవలందించే లక్ష్యంతో అన్ని జిల్లాల్లో కొత్త సమీకృత కలెక్టరేట్లు రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో కొత్త కలెక్టరేట్లు అందుబాటులోకి రాగా.. నేడు మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.58 కోట్లతో నిర్మించిన ఈ కలెక్టరేట్ సముదాయం అన్ని హంగులతో ముస్తాబైంది. అంతకుముందు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ కార్యాలయాన్ని పార్టీ అధినేత కేసీఆర్ తన చేతుల మీదుగా ప్రారంభించారు. జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్, ఎంపీ మాలోత్ కవిత, వద్దిరాజు రవిచంద్ర, ఇతర ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ప్రారంభోత్సవాల అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారు. సమీక్ష తర్వాత వర్చువల్ విధానంలో జిల్లా గ్రంథాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఆపై కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. మహబూబాబాద్ పర్యటన ముగియగానే సీఎం హెలికాప్టర్లో నేరుగా భద్రాద్రి కొత్తగూడెం వెళ్లనున్నారు. అధునాతన హంగులతో పూర్తయిన సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని, నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం సభలో ప్రసంగించనున్నారు.
అక్కడి నుంచి ప్రకాశం స్టేడియం చేరుకుని హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్ బయల్దేరనున్నారు.