హైదరాబాద్ : రూ. 35వేల కోట్ల సర్పంచ్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి
మళ్లించిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. భిక్షాటన చేసి
పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితులు తలెత్తాయని అన్నారు.
సర్పంచ్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు
రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రూ.35 వేల కోట్ల సర్పంచ్ల నిధులను కేసీఆర్
ప్రభుత్వం దారి మళ్లించిందని ధ్వజమెత్తారు.హైదరాబాద్‌లో ఇందిరాపార్క్
ధర్నాచౌక్ వద్ద ‘నిధులు, విధులపై సర్పంచ్ల శంఖారావం’ పేరుతో ప్రభుత్వానికి
వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పంచాయతీల
అభివృద్ధి కోసం ఆస్తులు అమ్మి, అప్పులు చేసి సర్పంచ్‌లు పనులు చేశారన్నారు.
సకాలంలో బిల్లులు చెల్లించక కొందరు సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు ఆత్మహత్యలు
చేసుకున్నారని తెలిపారు. భిక్షాటన చేసి పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు
ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయని ఎద్దేవా చేశారు. గ్రామపంచాయతీల నిధులను పెద్ద
గుత్తేదారులకు ఇచ్చారని, గ్రామాల్లో చెట్లు చనిపోతే సర్పంచ్‌లను సస్పెండ్
చేస్తున్నారని రేవంత్ ధ్వజమెత్తారు.
పట్టణ ప్రాంతాల్లో డ్రైనేజీ లోపాల వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయని, దీనిపై
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రేవంత్
ప్రశ్నించారు. కాలువలు, చెరువుల్లో పడి ఎంతోమంది చిన్నారులు చనిపోయారని
అన్నారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దిన ఘనత కాంగ్రెస్‌కే
చెందుతుందని రేవంత్ అన్నారు. ఈ ఏడాది కేవలం జీతాల కోసమే ఇప్పటి వరకు రూ.28
వేల కోట్లు అప్పుతెచ్చిన కేసీఆర్.. ఇంకా మూడు నెలలపాటు ఉద్యోగులకు జీతాలు ఎలా
ఇస్తారని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రంగా పేరొందిన తెలంగాణను అప్పుల ఊబిలోకి
నెట్టేశారని విమర్శించారు.ఇప్పటి వరకు రూ. 5 లక్షల కోట్ల అప్పు చేశారని,
కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఒక్కో వ్యక్తిపై రూ.1.5 లక్షల అప్పు మోపిందని
ఆరోపించారు. గతంలో జీహెచ్ఎంసీకి బ్యాంకుల్లో రూ.600 కోట్లు ఫిక్స్డ్
డిపాజిట్లు ఉండేవని, కేసీఆర్ పాలనలో జీహెచ్ఎంసీకి అప్పు పుట్టని పరిస్థితులు
వచ్చాయని విమర్శించారు.