హైదరాబాద్ : టీఎస్ఆర్టీసీ టిక్కెటేతర ఆదాయాన్ని పెంచుకోవాలనే ఆలోచనతో
ముందడుగు వేయడం అభినందనీయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్
కుమార్ గారు అన్నారు. టీఎస్ఆర్టీసీ సొంత బ్రాండ్ జీవా వాటర్ బాటిళ్లను
సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్
స్టేషన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని సంస్థ
ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎం.ఎల్.ఎ , టి, ఆర్ అండ్ బి కార్యదర్శి
, కె.ఎస్.శ్రీనివాస రాజు, మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనార్ తో కలిసి
లాంఛనంగా ప్రారంభించిన అనంతరం నీళ్లను రుచి చూశారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ ప్రతీ ఏటా టీఎస్ఆర్టీసీ 90లక్షల లీటర్ల వాటర్ బాటిళ్లను బయట
నుంచి కొని వినియోగించడం జరుగుతోందని, ఇక ఆ పరిస్థితి ఉండదని, సొంతంగా
జీవా వాటర్ బాటిళ్లనే వాడనున్నట్లు తెలుపుతూ ఈ వ్యాపారంలోకి సంస్థ
అడుగుపెట్టడం శుభపరిణామని కొనియాడారు. టీఎస్ఆర్టీసీలో దాదాపు 50 వేల
మందిని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా టీఎస్ఆర్టీసీ
ఆదాయం పెంచుకోవాలని భావిస్తోందని చెప్పారు. టీఎస్ఆర్టీసీ ప్రజల ఆస్తి అని,
పేద, మధ్య తరగతి వాళ్లు వినియోగించే ఈ సంస్థను ఎట్టి పరిస్థితుల్లోనూ
ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయబోదని స్పష్టం చేశారు.
సంస్థ ఎండీగా సజ్జనర్ బాధ్యతలు స్వీకరించిన తరువాత 20 నుంచి 25 డిపోలను
లాభాల బాటలోకి తీసుకురావడం అభినందనీయంటూ రాబోయే రోజుల్లో అన్ని డిపోలు
లాభాల్లోకి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం టీఎస్ఆర్టీసీకి
టికెట్ ద్వారా వచ్చే ఆదాయమే ప్రధానమని గుర్తు చేస్తూ, టిక్కెటేతర ఆదాయం పై
కూడా దృష్టి పెట్టడం జరిగిందన్నారు. ప్రతి రోజు 9 వేల బస్సులు ౩౩ లక్షల
కిలోమీటర్లు తిరుగుతూ 30 లక్షలు మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు
చేర్చుతోందని వివరించారు. టీఎస్ఆర్టీసీ సొంత బ్రాండ్‌తో మార్కెట్లోకి
వస్తోన్న స్వచ్ఛమైన తాగునీరు ‘జీవా’ను ప్రజల ఆదరించాలని మంత్రి కోరారు.