ఎడ్‌సెట్ తప్ప మిగిలిన 6 ప్రవేశ పరీక్షలకు కొత్త వారే
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి వెల్లడి
హైదరాబాద్: ఎంసెట్ సహా మరో ఆరు ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కొత్త కన్వీనర్లు
నియమితులయ్యారు. ఎంసెట్ కన్వీనర్‌గా జేఎన్టీయూహెచ్ సివిల్ ఇంజినీరింగ్
విభాగాధిపతిగా ఉన్న ఆచార్య బి.డీన్‌కుమార్‌ను నియమించారు. కన్వీనర్లతో పాటు
ప్రవేశ పరీక్షలు నిర్వహించే విశ్వవిద్యాలయాలను కూడా మార్చారు. రాష్ట్ర ఉన్నత
విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి ప్రవేశ పరీక్షలు జరిపే
వర్సిటీలు, కన్వీనర్ల వివరాలను వెల్లడించారు. గత మూడేళ్లుగా ఎంసెట్
కన్వీనర్‌గా జేఎన్టీయూహెచ్ కంప్యూటర్ సైన్స్ ఆచార్యుడు, రెక్టార్
గోవర్ధన్ కొనసాగగా.. ఈసారి డీన్‌కుమార్‌ను నియమించారు. ఈయన గతంలో పరీక్షల
నియంత్రణ విభాగం కంట్రోలర్‌గా, చీఫ్ ఇంజినీర్‌గా పనిచేశారు. ఈసారి కొత్తగా
ఐసెట్, లాసెట్ కన్వీనర్లుగా మహిళలు రావడం విశేషం.
నాలుగు వర్సిటీలు మారాయి : ఇప్పటివరకు ఈసెట్‌ను జేఎన్టీయూహెచ్ నిర్వహించగా
ఈసారి దాన్ని ఓయూకు అప్పగించారు. ఎంటెక్, ఎంఫార్మసీ తదితర కోర్సుల్లో
ప్రవేశానికి నిర్వహించే పీజీ ఇంజినీరింగ్ సెట్‌ను ఓయూ నుంచి తొలగించి
జేఎన్టీయూహెచ్కు కేటాయించారు. అంతేకాకుండా ఫిజికల్ ఎడ్యుకేషన్ (పీఈసెట్)
ఉమ్మడి ప్రవేశ పరీక్షను నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం నుంచి
తొలగించి కరీంనగర్‌లోని శాతవాహన వర్సిటీకి అప్పగించారు. ఇప్పటివరకు ఓయూ చేతులో
ఉన్న ఎడ్‌సెట్ (బీఈడీ సీట్ల భర్తీకి)ను మహాత్మాగాంధీ వర్సిటీకి కేటాయించారు.
ఎంసెట్, ఐసెట్, లాసెట్‌లను గతంలో చేపట్టిన యూనివర్సిటీలే నిర్వహిస్తాయి.
ఎడ్‌సెట్, పీఈసెట్‌లను ఇతర వర్సిటీలకు కేటాయించినా కన్వీనర్లు మాత్రం
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆచార్యులే ఉంటారు. ఎడ్‌సెట్‌కు గత ఏడాది కన్వీనర్‌గా
వ్యవహరించిన రామకృష్ణ ఈ ఏడాది కూడా కొనసాగనున్నారు.
సంక్రాంతి తర్వాత పరీక్షల తేదీల వెల్లడి : ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం
ప్రధాన సబ్జెక్టు పరీక్షలు మార్చి 29వ తేదీతో ముగుస్తాయి. ఆ తర్వాత 30 నుంచి
45 రోజుల సమయం ఇచ్చి ఎంసెట్‌ను నిర్వహించడం ఆనవాయితీ. ఆ ప్రకారం మే నెల
మధ్యలోనే జరిపే అవకాశం ఉందని భావిస్తున్నారు. మే 7వ తేదీన నీట్, జూన్ 4న
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జరుగుతుంది. వాటిని కూడా పరిగణనలోకి తీసుకొని
ఎంసెట్ తేదీలను నిర్ణయిస్తామని ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. తొలుత
పాలిటెక్నిక్ పూర్తయిన విద్యార్థులు రాసే ఈసెట్‌ను జరుపుతారు. ఇక మిగిలినవి
డిగ్రీ పూర్తయిన వారే రాస్తారు. డిగ్రీ చివరి సెమిస్టర్ పరీక్షల తేదీలతో పాటు
ఆన్లైన్ పరీక్షల నిర్వహణ బాధ్యత అప్పగించిన టీసీఎస్ అయాన్ డిజిటల్
ప్రతినిధులతో చర్చించి సంక్రాంతి తర్వాత తేదీలను వెల్లడిస్తామని ఆయన
వివరించారు. మొత్తానికి ఈసెట్, ఎంసెట్ మే నెలలో జరుగుతాయని స్పష్టమవుతోంది.