19న సికింద్రాబాద్‌లో రైలును ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ
సికింద్రాబాద్-విజయవాడ మధ్య నడపాలని నిర్ణయం
విశాఖ వరకూ వందే భారత్ రైలును పొడిగించే అవకాశం
హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 19న హైదరాబాద్ రానున్నారు.
సికింద్రాబాద్ స్టేషన్లో తెలుగు రాష్ట్రాల తొలి వందేభారత్ రైలును
ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మధ్య ఈ రైలు నడవనుంది.
దీన్ని విశాఖ వరకూ పొడిగించే అవకాశాలున్నాయని సమాచారం. కర్ణాటకలోని కలబురగి
నుంచి ప్రధాని హైదరాబాద్ వస్తారు. సికింద్రాబాద్ స్టేషన్ పునరభివృద్ధి
పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో : రాష్ట్రంలో అతిపెద్ద స్టేషన్ సికింద్రాబాద్‌ను
రూ.699 కోట్ల వ్యయంతో పునరభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుత భవానాల్ని కూల్చి
అంతర్జాతీయ ప్రమాణాలు, పూర్తిస్థాయి వసతులతో నూతనంగా నిర్మిస్తారు. గుత్తేదారు
ఎంపిక అక్టోబరులోనే పూర్తయింది. రైల్వేశాఖ దేశంలోని ప్రధాన రైల్వేస్టేషన్లను
పునరభివృద్ధి (రీడెవలప్మెంట్) చేస్తోంది. రాష్ట్రంలో ఈ జాబితాలో ఉన్న మొదటి
స్టేషన్ సికింద్రాబాద్. ద.మ.రైల్వే జోన్ ప్రధానకేంద్రం కూడా ఇక్కడే ఉంది.
స్థానిక ఎంపీ, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ నుంచి
ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.
సికింద్రాబాద్ స్టేషన్ రీడెవలప్మెంట్తో పాటు వందేభారత్ ఎక్స్‌ప్రెస్
ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాని మోదీని గత నెలలోనే ఆయన ఆహ్వానించారు. 36
నెలల్లో పునరభివృద్ధి పనులు చేస్తామని ద.మ.రైల్వే ఇటీవల ప్రకటించింది. నిత్యం
ఇక్కణ్నుంచి 200 రైళ్లు, 1.80 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.
రానున్నరోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో 2040 నాటికి ఉండే
అవసరాలు, రద్దీని తట్టుకునేలా ప్రణాళిక రూపొందించారు. వందేభారత్ రైలులో
సికింద్రాబాద్ నుంచి విజయవాడకు సుమారు నాలుగు గంటల్లో చేరుకోవచ్చు.