సుల్తాన్పూర్ వైద్యోపకరణాల పార్కుకు 60 లక్షల కళ్లజోళ్లకు ఆర్డరు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచాలి
తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 18వ తేదీ నుంచి నిర్వహించనున్న
కంటివెలుగు కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లాలో తయారైన కళ్లజోళ్లను పంపిణీ
చేయనున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. చైనా నుంచి
దిగుమతి చేసుకున్న కళ్లజోళ్లను గత కంటివెలుగు కార్యక్రమంలో అందజేశామని, ఇక
నుంచి సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ వైద్యోపకరణాల పార్కులో తయారైన
కళ్లజోళ్లనే అందజేస్తామన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో కంటివెలుగుపై
ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బందికి నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంత్రి
మాట్లాడారు. కంటివెలుగులో పరీక్షలు చేసిన తర్వాత పంపిణీ చేసేందుకుగాను
సుల్తాన్పూర్ వైద్యోపకరణాల పార్కుకు 60 లక్షల కళ్లజోళ్లకు ఆర్డరు
ఇచ్చామన్నారు. ఈ సారి అందించే కళ్లజోళ్లు ‘మేడిన్ తెలంగాణ..మేడిన్
సుల్తాన్పూర్’ అని అభివర్ణించారు. కంటివెలుగు ప్రపంచంలోనే అతిపెద్ద
కార్యక్రమమని, దీనిపై ఇప్పటికే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్
ప్రతినిధులకు సమాచారం అందించామని అన్నారు. సంగారెడ్డి జిల్లా పరిషత్
సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. వివిధ పథకాల ద్వారా రాష్ట్రానికి రావాల్సిన
రూ.45 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం నిలిపేసిందని మండిపడ్డారు. బోరుబావులకు
మోటార్లు పెట్టలేదని ఏడాదికి రూ.6 వేల కోట్ల చొప్పున అయిదేళ్లలో రూ.30 వేల
కోట్లు ఆపేసిందని ఆరోపించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచాలి : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు
పెంచేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు జిల్లా వైద్యాధికారులు,
సిబ్బందిని ఆదేశించారు. రాష్ట్రంలోని జిల్లా వైద్యాధికారులు, డిప్యూటీ
డీఎంహెచ్ఓలు, పీహెచ్‌సీల వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలతో మంత్రి
టెలీకాన్ఫరెన్స్ ద్వారా నెలవారీ సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ‘‘జగిత్యాల,
కరీంనగర్, సూర్యాపేట జిల్లాల్లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో సాధారణ కాన్పులు,
నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రైవేటు దవాఖానాల్లో సిజేరియన్లు ఎక్కువగా
జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సర్కారు దవాఖానాల్లో కాన్పులు పెరిగేలా చొరవ
చూపాలి’’ అని సూచించారు. ప్రభుత్వ వైద్యంలో అత్యధిక కాన్పులు నిర్వహించి
ఆదర్శంగా నిలిచారంటూ సంగారెడ్డి జిల్లా ప్రజలు, వైద్యాధికారులు, సిబ్బందిని
మంత్రి అభినందించారు. సమీక్షలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్
శ్వేతామహంతి, వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ రమేశ్‌రెడ్డి, ప్రజారోగ్య
సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు, టీవీవీపీ కమిషనర్ అజయ్‌కుమార్
తదితరులు పాల్గొన్నారు.