కోరుట్ల : ప్రజలకు వైద్యసేవలు అందించడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా
నిలిచిందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. జగిత్యాల జిల్లా
కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి పట్టణాల్లో బస్తీ దవాఖానా, డయాలసిస్
కేంద్రాలు, నూతన ఆసుపత్రులు తదితరాలను మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే
విద్యాసాగర్‌రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా నందిమేడారంలో
30 పడకల ఆసుపత్రి భవనానికి మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేశ్ నేత
తదితరులతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. రాష్ట్ర
ఏర్పాటుకు ముందు తెలంగాణలో కేవలం 3 డయాలసిస్ కేంద్రాలు ఉండేవని, ఇప్పుడు 122
ఏర్పాటు చేశామన్నారు. ఐసీయూ పడకలను 200 నుంచి 6000కు పెంచామని తెలిపారు. 81
వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేసి 2023ను రాష్ట్ర
ప్రభుత్వం ‘ఉద్యోగ తెలంగాణ సంవత్సరం’గా మార్చిందన్నారు. హైదరాబాద్‌లో 300
బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశామని, జిల్లాల్లో 100 ఏర్పాటు చేస్తున్నామన్నారు.
తెలంగాణ ప్రజలకు అందిస్తున్న వైద్యసేవలను యునిసెఫ్ ప్రశంసించిందన్నారు.
రాష్ట్రంలో వ్యవసాయ బావుల వద్ద విద్యుత్తు మీటర్లు పెట్టనందుకు తెలంగాణకు
కేంద్రం అన్యాయం చేస్తోందని హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన
రూ.30 వేల కోట్లను ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో వరుసగా ఉద్యోగ ప్రకటనలు
వెలువడుతుండటంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు భయం మొదలైందన్నారు.
కేంద్రంలో 16 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని కేంద్ర మంత్రి ప్రకటించారని, వాటి
నియామకాలను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.