రూ.250 కోట్ల పెట్టుబడులు, 750 మందికి ఉపాధి
హైదరాబాద్ : ప్రసిద్ధ దేశీయ సంస్థ గోద్రెజ్ తెలంగాణలో రూ.250 కోట్ల
పెట్టుబడితో అంతర్జాతీయస్థాయి వంట నూనెల శుద్ధి పరిశ్రమను ఏర్పాటు చేయనుంది.
ఖమ్మం జిల్లాలో స్థాపించే ఈ పరిశ్రమ ద్వారా 750 మందికి ఉపాధి కల్పించనుంది.
గోద్రెజ్ వ్యవసాయ విభాగం (అగ్రోవెట్) ఎండీ బలరాంసింగ్ యాదవ్ ఆధ్వర్యంలో
ప్రతినిధి బృందం పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌తో ప్రగతిభవన్‌లో
సమావేశమైంది. తమ నిర్ణయానికి సంబంధించిన ప్రతిపాదనలు అందజేసింది. ఈ సందర్భంగా
బలరాం మాట్లాడుతూ ‘‘ తెలంగాణలోని ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు అద్భుతంగా
ఉన్నాయి. దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తున్నాయి. గోద్రెజ్ సంస్థ
విస్తరణలో భాగంగా వివిధ రాష్ట్రాలను పరిశీలించిన తర్వాత తెలంగాణలో అతి పెద్ద
వంటనూనెల శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. గంటకు 30 టన్నుల నూనె
ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేసే ఈ ప్లాంటును 2025లో ప్రారంభిస్తాం. ఆ
తర్వాత దాన్ని 60 టన్నుల సామర్థ్యానికి పెంచుతాం. సంస్థ విద్యుత్తు అవసరాల
కోసం ప్రత్యేకంగా విద్యుదుత్పత్తి కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తాం. పరిశ్రమ
అవసరాల నిమిత్తం ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో ఆయిల్‌పామ్ పంటను
ప్రోత్సహిస్తాం. రైతుల కోసం 10 గోద్రెజ్ సహాయ కేంద్రాలను ఏర్పాటు చేస్తాం.
ఆయిల్‌పామ్ రైతులకు అవసరమైన సలహాలు అందించడంతో పాటు ఉపగ్రహ, డ్రోన్
ట్రాకింగ్ లాంటి వినూత్న సాంకేతికతలు, మొబైల్ యాప్ లాంటి సౌకర్యాలను
కల్పిస్తాం’’ అని బలరాం తెలిపారు.
రాష్ట్రంలో పసుపు విప్లవం : మంత్రి కేటీఆర్
గోద్రెజ్ సంస్థ వంట నూనెల శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయడాన్ని మంత్రి
కేటీఆర్ స్వాగతించారు. ఈ సందర్భంగా బలరాంను సత్కరించారు. తెలంగాణలో ఇదే భారీ
నూనెశుద్ధి కర్మాగారమని వెల్లడించారు. దీని ద్వారా నిరుద్యోగ యువతతో పాటు
అన్నదాతలకు గొప్ప మేలు జరుగుతుందన్నారు. గోద్రెజ్ సంస్థకు కృతజ్ఞతలు
తెలిపారు. ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. 20 లక్షల ఎకరాల్లో
ఆయిల్‌పామ్ సాగును లక్ష్యంగా నిర్దేశించుకున్నామని గోద్రెజ్ ఈ రంగంలో
మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరారు. ప్రభుత్వ ప్రయత్నాల ఫలితంగా రాష్ట్రంలో
పసుపు విప్లవం (యెల్లో రెవల్యూషన్) మొదలైందన్నారు. సమావేశంలో ఎంపీ
రంజిత్‌రెడ్డి, తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్,
ఇతర అధికారులు పాల్గొన్నారు.