హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జిని పార్టీ అధ్యక్షుడు
మల్లికార్జునఖర్గే మార్చారు. ఇప్పటివరకు రాష్ట్ర బాధ్యతలు చూస్తున్న తమిళనాడు
నేత మాణికం ఠాగూర్‌ను తప్పించి ఆ స్థానంలో మహారాష్ట్ర సీనియర్‌నేత మాణిక్‌రావు
ఠాక్రేను నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీచేసింది. రెండేళ్లకు
పైగా తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్న ఠాగూర్ ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు
రేవంత్‌రెడ్డి చెప్పినట్లు వింటూ సీనియర్లను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ
అధిష్ఠానానికి ఫిర్యాదులు రావడంతో ఆయన్ను తప్పించినట్లు సమాచారం. ఇటీవల కొందరు
సీనియర్ నేతలు ఖర్గేను కలిసి రాష్ట్ర పార్టీ వ్యవహారాలను వివరించినప్పుడు
త్వరలో అన్నింటినీ సరిదిద్దుతానని హామీ ఇచ్చారు. అందులోభాగంగానే ఈ మార్పు
చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి తప్పించిన ఠాగూర్‌కు గోవా ఇన్‌ఛార్జి
బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు గోవా, తమిళనాడు, పుదుచ్చేరిల ఇన్ఛార్జిగా
ఉన్న దినేష్‌గుండూరావు నుంచి గోవా బాధ్యతలు తప్పించారు. రాష్ట్ర పార్టీ
వ్యవహారాలపై ఖర్గే కూడా ప్రత్యేక దృష్టిసారించడంతో త్వరలోే దిల్లీలో లేదా
హైదరాబాద్‌లో పీసీసీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారని విశ్వసనీయ సమాచారం.
విభేదాలపై స్పందించిన ఏఐసీసీ : కొత్త కమిటీల నియామకం నేపథ్యంలో పీసీసీ
అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య విభేదాలు
తీవ్ర స్థాయికి చేరుకొన్నాయి. రేవంత్ వైఖరిని తప్పుపడుతూ సీఎల్పీ నేత
భట్టివిక్రమార్క నివాసంలో ఆయనతో పాటు ముఖ్యనేతలు ఉత్తమ్, దామోదర రాజనర్సింహా,
జగ్గారెడ్డి, మధుయాస్కీ, మహేశ్వర్‌రెడ్డి సమావేశమయ్యారు. పలువురు రాష్ట్ర
ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్ వైఖరిని తప్పుపట్టడంతో పాటు పూర్తిగా రేవంత్‌కి
మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం
రంగంలోకి దిగింది. ఏఐసీసీ సీనియర్‌నేత దిగ్విజయ్‌సింగ్‌ను హైదరాబాద్ పంపింది.
ఆయన రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ పరిస్థితి, నేతల
మధ్య విభేదాలు, మాణికంఠాగూర్ స్థానంలో సీనియర్‌ను పార్టీ ఇన్ఛార్జిగా
నియమించాల్సిన అవసరం సహా ప్రధానంగా 5 అంశాలపై ఏఐసీసీకి నివేదిక ఇచ్చారు.
దీనిపై చర్చించిన అధిష్ఠానం కొత్త ఇన్‌ఛార్జిని నియమించింది. బుధవారం తెలంగాణ
కాంగ్రెస్ నేతల వాట్సప్ గ్రూపు నుంచి మాణికంఠాగూర్ తప్పుకోవడం.. రాత్రి
కొత్త ఇన్‌ఛార్జి నియామకం వెనువెంటనే జరిగిపోయాయి. ఠాగూర్ కూడా తెలంగాణ
వ్యవహారాల నుంచి తప్పించాలని ఏఐసీసీ ముఖ్యనేతలను కోరినట్లు తెలిసింది.
ఎవరీ ఠాక్రే : 68 ఏళ్ల మాణిక్‌రావు ఠాక్రేకి మహారాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ
అనుభవం ఉంది. ఈయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా, ఒకసారి
మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. శరద్‌పవార్, విలాస్‌రావ్
దేశ్‌ముఖ్, సుశీల్‌కుమార్ శిందే ప్రభుత్వాల్లో మంత్రిగా సేవలందించారు.
మహారాష్ట్ర శాసనమండలి ఉపాధ్యక్షుడిగా పనిచేసిన అనుభవమూ ఉంది.