హైదరాబాద్ : డయాలసిస్ బాధితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ అమ్మప్రేమను
చూపుతున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. చౌటుప్పల్‌లో డయాలసిస్ కేంద్రాన్ని
ఆయన ప్రారంభించారు. పేదలకు ఉచితంగా డయాలసిస్ సేవలు అందించడంలో తెలంగాణ
రాష్ట్రం దేశానికి దిక్సూచిగా నిలిచిందని, వైద్య సీట్లలో దేశంలో అగ్రస్థానంలో
ఉన్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హరీశ్‌రావు
తెలిపారు. చౌటుప్పల్‌లోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఐదు పడకల
డయాలసిస్ కేంద్రాన్ని జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లింగయ్య
యాదవ్, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి ఆయన
ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సమైక్య పాలనలో, సమైక్య
రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్క డయాలసిస్ కేంద్ర కూడా ఉండేది కాదని,
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రతి నియోజకవర్గంలో డయాలసిస్
కేంద్రాలు ఏర్పాటు చేసి, కిడ్నీ వ్యాధి గ్రస్తులకు ఉచితంగా వైద్య సేవలు
అందిస్తున్నామని చెప్పారు. సింగిల్ యూజ్ ఫిల్టర్ విధానంతో ఒక్కపైసా ఖర్చు
లేకుండా రోగులకు సేవలు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ పద్ధతిని పరిశీలించి, వారి రాష్ట్రంలో అమలు
చేయడం గర్వకారణమని చెప్పారు. డయాలసిస్ రోగులకు ఉచితంగా బస్సు పాసులు, ఆసరా
పింఛను కూడా అందించడం కేసీఆర్ అందించిన వరమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మూడు
డయాలసిస్ కేంద్రాలు ఉండేవని, ఆ సంఖ్య ప్రస్తుతం 102కి పెరిగిందని
వివరించారు.ఈ సేవలు అందించేందుకు ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు
ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ డయాలసిస్ రోగులపై
తల్లిప్రేమను చూపుతున్నారని హరీశ్‌రావు అన్నారు.
వివక్ష చూపిన కేంద్ర ప్రభుత్వం : కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 157 వైద్య
కళాశాలలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వకుండా మొండి చెయ్యి
చూపిందని హరీశ్‌రావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ ఇస్తామంటే వారి
మాట నమ్మి రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్లు విలువైన భవనాలు, భూమి ఇచ్చి
నాలుగేళ్లయినా వైద్య విద్యార్థులకు సౌకర్యాలు కల్పించలేదని ఆవేదన వ్యక్తం
చేశారు. ఎయిమ్స్‌లో పరిస్థితి ‘పేరు గొప్ప..ఊరు దిబ్బలా ఉందని’ ఆయన
వ్యాఖ్యానించారు. అక్కడ అత్యవసర సేవలు లేవని, ఆపరేషన్ థియేటర్ లేదని,
రక్తనిధి ఏర్పాటు చేయలేదని, అక్కడి విద్యార్థులు ఏమీ నేర్చుకోకుండా
డాక్టర్లయితే ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. ఆ విద్యార్థుల దయనీయ
పరిస్థితి చూసి, భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో నేర్చుకునే అవకాశం
కల్పించినట్లు తెలిపారు. ఎయిమ్స్ పని తీరుకు రాష్ట్రప్రభుత్వ కళాశాలల పని
తీరుకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, స్థానిక పురపాలిక ఛైర్మన్
వెన్‌రెడ్డి రాజు ఆస్పత్రి సూపరింటెండెంట్ అలివేలు తదితరులు పాల్గొన్నారు.