అధికారులు, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు
హైదరాబాద్ : రాష్ట్రంలో పంచాయతీ రోడ్లు అద్దంలా ఉండాలని, వర్షాకాలంలో మొదటి
వర్షం పడేటప్పటికీ ఏ ఒక్క రోడ్డు మీద గుంత కనిపించవద్దని, దెబ్బతిన్న
రోడ్లన్ని బాగు కావాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ
నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి కేసిఆర్ ఇటీవల రాష్ట్రంలోని రోడ్ల మీద సమీక్ష చేసి, రోడ్లపై
గుంతలు ఉండకుండా, రోడ్లన్ని బాగుండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించిన నేపథ్యంలో
వరుసగా సమీక్షలు చేస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేడు మరోసారి
రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలోని మంత్రి ఛాంబర్లో అన్ని జిల్లాల
సూపరింటెండెంట్ ఇంజనీర్లతో నేడు సమావేశమయ్యారు. అనంతరం అన్ని జిల్లాల
కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ ఆఫీసర్లు, మండల పంచాయతీ
ఆఫీసర్లు, డిఆర్ఢిఓ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. మొదటగా
అధికారులు, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి
కేసిఆర్ ఆలోచనల మేరకు అధికారులు, సిబ్బంది బాగా పనిచేయడం వల్ల మన శాఖకు మంచి
పేరు వచ్చిందని, జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. ఈ
స్పూర్తిని ఇదేవిధంగా కొనసాగించాలని కోరారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కావాలని
రాష్ట్రానికి నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఆర్ధికంగా కొంత ఇబ్బంది
ఏర్పడిందన్నారు. మనకు కేంద్రం నుంచి 1100 కోట్ల రూపాయలు రావల్సి ఉండగా ఇవ్వడం
లేదన్నారు. రైతు కల్లాల కోసం 151 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం తప్పుగా భావించి
మనకు రావాల్సిన 1100 కోట్ల రూపాయలను కేంద్రం ఆపడాన్ని విమర్శించారు. ఈ
విషయాన్ని అధికారులు, సర్పంచులు అర్థం చేసుకోవాలని చెప్పారు. కేంద్రం ఇస్తున్న
గ్రాంట్ కు సమానంగా గ్రాంట్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణదే అన్నారు.
సర్పంచ్ లకు అన్ని విధాల అధికారాలు ఇచ్చామన్నారు. తెలంగాణ
రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక ఒక గ్రామంలో పెన్షన్లు, రైతు బంధు, రైతుబీమా, కళ్యాణ
లక్ష్మీ, షాదీ ముబారక్, కేసిఆర్ కిట్ వంటి ముఖ్య పథకాల లబ్దిదారులు, ప్రతి నెల
వచ్చే మొత్తం, తెలంగాణ వచ్చాక ఆ గ్రామానికి అందిన మొత్తం వివరాలతో ప్రతి
పంచాయతీలో బోర్డులు చేసి పెట్టించాలని అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ
భవానాలకు ఇటీవల మంజూరు చేసిన 3686 భవనాల నిర్మాణం వేగవంతం చేయాలని ఆదేశించారు.
ప్రతి గ్రామంలో వైకుంఠదామాలు, ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు పూర్తి
స్థాయిలో వినియోగంలోకి రావాలని చెప్పారు. ప్రతి నియోజక వర్గానికి 5 కోట్ల
రూపాయలతో రోడ్ల ప్రతిపాదనలు ఇవ్వాలన్న జాబితా వెంటనే ఇవ్వాలని ఆదేశించారు. ఈ
కాన్ఫరెన్సులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యదర్శి సందీప్ సుల్తానియా,
ఇంజనీర్ ఇన్ చీఫ్ సంజీవ రావు, కమిషనర్ హనుమంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.