వరంగల్ : రామప్ప ఆలయంలోని శిల్ప సౌందర్యాన్ని తిలకించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముగ్ధులయ్యారు. బుధవారం కుమార్తె ఇతిశ్రీ ముర్ము, ఇతర కుటుంబసభ్యులతో కలిసి ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప ఆలయాన్ని దర్శించుకున్నారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి, కిషన్రెడ్డి, రాష్ట్రమంత్రి శ్రీనివాస్గౌడ్లు ఉన్నారు. హెలికాప్టర్ ద్వారా భద్రాచలం నుంచి నేరుగా పాలంపేటకు వచ్చిన రాష్ట్రపతికి ఆలయం వద్ద స్థానిక మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్రావు, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యలు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేదపండితులు పూర్ణకుంభంతో ఆహ్వానించి ఆలయంలోకి తీసుకెళ్లారు. ఆలయ విశిష్టతను కాకతీయ హెరిటేజ్ ట్రస్టు సభ్యుడు ఆచార్య పాండురంగారావు రాష్ట్రపతికి వివరించారు. రామప్ప ఆలయ గోపురంపైన ఉన్న ఇటుకలను నీళ్లలో వేసి అవి తేలియాడటాన్ని ప్రత్యక్షంగా చూపించారు. పది నిమిషాల పాటు ఆమె ఆలయంలోని నాగినులు, మదనికలు, ఇతర శిల్పాల ప్రత్యేకతలను చూశారు. అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. మేడారం పూజారులు సమ్మక్క సారలమ్మ ప్రసాదాన్ని ఆమెకు అందజేశారు. రామప్ప ఆలయం గొప్పతనాన్ని తెలిపేలా కాకతీయ హెరిటేజ్ ట్రస్టు వారు ముద్రించిన పుస్తకాలను రాష్ట్ట్ర్రపతికి అందజేశారు. రామప్ప ఆలయ చిత్రంతో కూడిన జ్ఞాపికను కేంద్రమంత్రి కిషన్రెడ్డి అందజేశారు.
కామేశ్వరాలయానికి శంకుస్థాపన : ఆలయంలో దర్శనం పూర్తయ్యాక ఆవరణలో ఏర్పాటుచేసిన వేదికపై నుంచి రాష్ట్రపతి ముర్ము కామేశ్వరాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.62 కోట్లతో చేపట్టాల్సిన పిలిగ్రిమేజ్ రెజువెనేషన్ అండ్ స్పిరిచ్యువల్ అగ్మెంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) పథకానికి సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే’ కీర్తనపై కళాకారులు చేసిన నృత్యాలను చూసి రాష్ట్రపతి కరతాళ ధ్వనులు చేశారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క తదితరులు పాల్గొన్నారు.