ఆరోగ్య శాఖ మంత్రి టీ హరీశ్ రావు
హైదరాబాద్: లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లతో, దేశంలోనే అత్యధిక మెడికల్
సీట్ల నిష్పత్తి తెలంగాణ కలిగి వుందని ఆ రాష్ట్ర రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి టీ
హరీశ్ రావు తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం నూతన రాష్ట్రం తెలంగాణ 3.51
కోట్ల జనాభాతో మొత్తం 6,690 ఎంబీబీఎస్ సీట్లను కలిగి ఉందన్నారు. ఇది సగటున
లక్ష జనాభాకు 19 సీట్లతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. అలాగే లక్ష
జనాభాకు 17.91 సీట్లతో కర్ణాటక రెండవ స్థానంలో ఉండగా, తమిళనాడు 15.35 సీట్లతో
మూడవ స్థానంలో ఉందన్నారు. హరీష్ రావు ఇంకా మాట్లాడుతూ.. పీజీ సీట్ల
నిష్పత్తిలో తెలంగాణ దేశంలోనే రెండవ స్థానంలో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో
ప్రతి లక్ష జనాభాకు 7.22 పీజీ సీట్లు ఉన్నాయి. అదే జనాభాకు 9.06 సీట్లతో
కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. వైద్య కళాశాలల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం
వివక్ష చూపినప్పటికీ, దూరదృష్టి గల రాష్ట్ర నాయకత్వం తెలంగాణ వైద్య విద్యను
విజయవంతం చేస్తుందని ఆరోగ్య మంత్రి అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా
పోటీలో లేవన్నారు. నీట్లో 8,78,280వ ర్యాంకు సాధించిన విద్యార్థి బీ కేటగిరీ
కింద ఎంబీబీఎస్ సీటు సాధించడంతో తెలంగాణ ఈ ఏడాది సరికొత్త రికార్డు
సృష్టించింది. ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలతో, రాష్ట్రంలో ఇప్పుడు 1,150
ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు
చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్ణయించారని హరీష్ రావు తెలిపారు.