హాజరు కాని కేసీఆర్
తెలంగాణ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గౌరవార్థం రాజ్భవన్లో ఇచ్చిన విందు ఉత్సాహంగా సాగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మినహా పలువురు రాష్ట్రమంత్రులు, నేతలు, అధికారులు ఈ వేడుకకు హాజరయ్యారు. రాష్ట్రనేతలు రాష్ట్రపతిని కలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం తెలంగాణకు వచ్చిన సందర్భంగా రాజ్భవన్లో రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై విందు ఇచ్చారు. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో రాజ్ భవన్కు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ సాదరంగా స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరుకాలేదు. పలువురు మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ విందుకు హాజరయ్యారు. సీఎస్, డీజీపీ సహా పలువురు ఉన్నతాధికారులు, ప్రముఖులు విందుకు హాజరయ్యారు. మంత్రులు, విపక్షనేతలు విందులో సరదాగా సంభాషించారు. దాదాపుగా గంటకు పైగా రాజ్ భవన్ లో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాత్రి తొమ్మిది గంటల తర్వాత బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం బయల్దేరి వెళ్లారు.