రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్రలో మంగళవారం విషాదం నెలకొంది. యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి కృష్ణకుమార్ పాండే (75) కన్నుమూశారు. నాగ్‌పూర్‌కు చెందిన కృష్ణకుమార్ మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. పార్టీ నాయకులు జైరాం రమేశ్, దిగ్విజయ్ సింగ్‌తో కలిసి పాదయాత్ర చేసే క్రమంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారని వైద్యులు ప్రకటించారు. ఈ విషయంపై జైరాం రమేశ్ మాట్లాడుతూ.. కృష్ణకుమార్ హఠాన్మరణం కలచివేసిందన్నారు. ‘దిగ్విజయ్ సింగ్, నాతోపాటు కృష్ణకుమమార్ యాత్రలో పాల్గొన్నారు. త్రివర్ణ పతాకం చేత ధరించి నడిచారు. కొద్దిదూరం వెళ్లాక పక్కనున్న వ్యక్తికి జెండా అప్పగించి.. గుండెల్లో నొప్పిగా ఉందని చెప్పారు. ఆస్పత్రికి తరలించేలోపే ఘోరం జరిగిపోయింది’ అని పేర్కొన్నారు. చివరి శ్వాస వరకు పాండే పార్టీ కోసం పనిచేశారని జైరాం రమేశ్ గుర్తు చేసుకున్నారు.