బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి అయోధ్య శ్రీరాముడిని దర్శించుకున్నారు. ఆయన రాములవారిని దర్శించుకున్న ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చుననే ప్రచారం సాగింది. దీనిని ఆయన కొట్టిపారేశారు. అయితే కాంగ్రెస్లోకి ఎంట్రీ లేదని, అందుకే చేరడం లేదని, ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారంటూ తాజాగా ప్రచారం సాగుతోంది. అయోధ్య పర్యటనలో మల్లారెడ్డి వెంట మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు ఉన్నారు. ఇటీవల బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య జైశ్రీరామ్ నినాదంపై రాజకీయ యుద్ధం కొనసాగుతోంది. జైశ్రీరామ్ నినాదం కడుపు నింపదని ఇటీవల కేటీఆర్ అన్నారు. అయితే ఏ నినాదం కూడా కడుపు నింపదని, ఎవరి విశ్వాసం వారిదని బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తాము మారీచుడి నోటి నుంచి అయినా నీచుడి నోటి నుంచి అయినా శ్రీరామ నామం గొప్పతనం చెప్పించగలమని బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.