రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హజరు
న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ కస్టడీ శనివారంతో ముగియనుంది. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హజరుపర్చనున్నారు. కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు ఈడీ వివరించనుంది. కవితకు ఈడీ కస్టడీ పొడిగింపు లేదా జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు సంస్థ కోరే అవకాశం ఉంది. గత ఆరు రోజులుగా ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్లో అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ పాలసీలో కవిత పాత్ర, రూ. 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర, సిసోడియా, కేజ్రీవాల్‌తో ఒప్పందాలపై కవితను ఈడీ ప్రశ్నిస్తోంది. లిఖిత పూర్వకంగా, మౌఖికంగా కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను గత శుక్రవారం(మార్చి 15) ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మార్చి 16న కవితకు రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. అలాగే ఏడు రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది. ఈ నెల 23న మధ్యాహ్నాం 12 గంటలకు కవితను తిరిగి హాజరు పరచాలని ఈడీని ఆదేశించింది.
జూలై 7, 2023 రోజున మాగుంట శ్రీనివాసులు రెడ్డి విచారణలో కీలక విషయాలు రాబట్టింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేసినప్పుడు కేసు పూర్వపరాలన్నీ పూస గుచ్చినట్టు వెల్లడించారని తెలిపింది. 2021 మార్చిలో నేను ఢిల్లీలో ఉన్నప్పుడు న్యూస్ పేపర్లలో ఢిల్లీ లిక్కర్ వ్యాపారం గురించి చదివాను. ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చూశాను. అప్పటి వరకు ప్రభుత్వ హయాంలో ఉన్న లిక్కర్ వ్యాపారాన్ని ప్రైవేటీకరణ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని చూశాను. మా కుటుంబం 71 సంవత్సరాలుగా లిక్కర్ బిజినెస్‌లో ఉంది. ఢిల్లీలో లిక్కర్ బిజినెస్‌లోకి ఎంటర్ అయితే మరిన్ని లాభాలు ఉంటాయనిపించింది. ఇదే పని మీద ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను మార్చి 16, 2021న సాయంత్రం 4.30 గంటలకు కలిశాను. కొద్దిసేపు మాట్లాడారు. ఢిల్లీలో వ్యాపారానికి ముందుకు రావాలని కోరారు. మీరు కవితను కలవాలని సూచించారు. ఈ విషయం ఇప్పటికే కవితతో చర్చించామని, ఆమ్ అద్మీ పార్టీకి వంద కోట్ల రుపాయలు ఇవ్వడానికి కవిత సిద్ధంగా ఉన్నారని కేజ్రీవాల్ చెప్పారు. కేజ్రీవాల్ సూచన మేరకు హైదరాబాద్‌లో మార్చి 19, 2021న కవితను కలిశాను. ఈ డీల్ వంద కోట్ల రూపాయలకు సంబంధించనదని, ఇందులో మీ వాటా ఏంటని అడిగారు. రూ.50 కోట్లు ఇవ్వమని అడిగారు. నేను రూ. 30 కోట్లు ఇస్తానని అంగీకరించాను. కవిత ఆడిటర్ బుచ్చిబాబును మా అబ్బాయి రాఘవ కలిసి 25 కోట్ల రూపాయల నగదు ఇచ్చారు. ఈ డబ్బును బోయిన్పల్లి అభిషేక్‌కు కవిత సూచనల మేరకు ఇచ్చామని పేర్కొన్నారు.