హైదరాబాద్ : జోడో యాత్ర ప్రజలతో మమేకమై సాగింది. ఇక్కడి సంస్కృతి..స్ఫూర్తి అద్భుతం. కార్యకర్తలు, ప్రజలు చూపిన ప్రేమాభిమానాలు, నాతో పంచుకున్న విషయాలు మరువలేను. ఇంతటి మమకారం చూపించిన ప్రాంతాన్ని వీడి పక్క రాష్టానికి వెళ్తుండడం కాస్త బాధగానే ఉందనికాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు.
రాష్ట్రంలో 12 రోజుల పాటు సాగిన యాత్ర : జోడో యాత్ర ప్రజలతో మమేకమై సాగింది. ఇక్కడి సంస్కృతి.. స్ఫూర్తి అద్భుతం. కార్యకర్తలు, ప్రజలు చూపిన ప్రేమాభిమానాలు, నాతో పంచుకున్న విషయాలు మరువలేను. ఇంతటి మమకారం చూపించిన ప్రాంతాన్ని వీడి పక్క రాష్టానికి వెళ్తుండడం కాస్త బాధగానే ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ , సీఎం కేసీఆర్‌లు ఎనిమిదేళ్లలోనే ప్రజల జీవితాలను ఆగం చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. ప్రైవేటీకరణ, నోట్ల రద్దు, జీఎస్టీ వసూళ్ల పేరిట కేంద్రం ప్రజలను ముంచేస్తుండగా ధరణి పోర్టల్, నీటిపారుదల ప్రాజెక్టుల పునరాకృతి పేరిట రాష్ట్రంలో దోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. భారత్ జోడో యాత్ర తెలంగాణలో ముగింపు సందర్భంగా కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్‌లో సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
దేశంలో విద్వేషం, హింసను ప్రేరేపిస్తూ బీజేపీ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోందని రాహుల్ విమర్శించారు. దీనికి వ్యతిరేకంగానే తాను భారత్‌జోడో యాత్రను చేపట్టానన్నారు. 12 రోజుల పాటు తెలంగాణలో సాగిన యాత్రలో ఇక్కడి ప్రజల కష్టాలు, వారిలోని స్ఫూర్తిని గమనించినట్లు పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీతో కేసీఆర్ కలిసే పనిచేస్తున్నారని, వారు ప్రవేశపెట్టే బిల్లులన్నింటికీ పార్లమెంటులో మద్దతు ఇస్తుండటమే ఇందుకు నిదర్శనమన్నారు. తాము అటవీహక్కుల చట్టం తీసుకువస్తే కేసీఆర్ అమలు చేయడం లేదన్నారు. గిరిజనులకు భూములను పంపిణీ చేయకపోగా ఇదివరకే ఇచ్చిన భూములను లాక్కుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుపేదలకు పంపిణీ చేసిన భూములపై హక్కులు కల్పిస్తామని, పంట రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.అన్ని రకాల పంటలకు మద్దతు ధర కల్పిస్తామన్నారు.
నాటి చైతన్యం ఏమైంది?: రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంటే నిలదీయాల్సిన మేధావులు, ఉద్యమకారులు ఏం చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. వారిలో తిరగబడే చైతన్యం ఎక్కడ పోయిందన్నారు.అమరుల త్యాగాలను చూసి కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఇస్తే.. ఇక్కడ పాలిస్తున్న వారు దోచుకుంటున్నా ప్రశ్నించకపోవడం బాధాకరమన్నారు. రాహుల్ జోడో యాత్రలో పీసీసీ అధ్యక్షుడిగా పాల్గొనడం ద్వారా తన జన్మ ధన్యమైందని రేవంత్ అన్నారు.ఈ జన్మకు ఇది చాలని, ఇప్పుడు ఈ వేదికపైనే ప్రాణాలొదిలినా ఫరవాలేదని భావోద్వేగంతో మాట్లాడారు. మల్లు భట్టివిక్రమార్క, జగ్గారెడ్డి, షబ్బీర్ అలీ, మధుయాస్కీ, శ్రీధర్‌బాబు, వీహెచ్ తదితరులు సభలో ప్రసంగించారు. రాహుల్ ప్రసంగాన్ని ముఖ్యనేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి అనువదించారు. కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, దిగ్విజయ్‌సింగ్, కేసీ వేణుగోపాల్, టి.సుబ్బరామిరెడ్డి, జానారెడ్డి, గీతారెడ్డి, గంగారాం, సంపత్‌కుమార్, సీతక్క, వీరయ్య, జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు మద్నూరు మండలం షేఖాపూర్‌లో విశ్రాంతి తీసుకున్న రాహుల్‌ను ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ కలిశారు.
మహారాష్ట్రలో : తెలంగాణలో జోడో యాత్ర సోమవారం కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్‌లో ముగిసింది. రాత్రి 7.30కి రాహుల్ మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా దెగ్లూర్‌లోకి ప్రవేశించారు. కార్యకర్తలు, నేతలు కాగడాల ప్రదర్శనతో స్వాగతం పలికారు.
ఆ బాలుడిలో తెలంగాణ పోరాట స్ఫూర్తి కనిపించింది : భారత్ జోడోయాత్రలో తనకు ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయంటూ రాహుల్ ఓ బాలుడి ఉదంతాన్ని బహిరంగ సభలో చెప్పారు. ‘ఓ రోజు యాత్రలో నడుచుకుంటూ వెళ్తుంటే, నా చుట్టూ ఉన్న పోలీసు రక్షణ వలయాన్ని దాటుకొని నా పక్కకు వచ్చేందుకు ఓ బాలుడు (శ్రీనివాస్‌రెడ్డి) ప్రయత్నించడం చూశా. పోలీసులు నెట్టివేయడంతో అతడికి దెబ్బతగిలింది. దీంతో వెళ్లిపోతాడనుకున్నా. కానీ మరోవైపు నుంచి లోపలికి వచ్చేందుకు ప్రయత్నించాడు. మళ్లీ పోలీసులు నెట్టివేయడంతో కిందపడిపోయాడు. ఈసారి తప్పక వెళ్లిపోతాడని పక్కనే ఉన్న వాళ్లతో చెప్పా. కానీ పది నిమిషాల తర్వాత ఆ బాలుడు అనూహ్యంగా నా పక్కకు చేరి నాతో పాటు నడవడం చూసి ఆశ్చర్యపోయా. ఇది తెలంగాణ పోరాట స్ఫూర్తికి నిదర్శనం. మీ నాన్నతో వచ్చావా అని అడిగా. మా నాన్న రావాలని అనుకున్నాడు కానీ రాలేకపోయాడని, ఒంటరిగానే వచ్చానని చెప్పాడు. ఎందుకని అడిగితే మౌనంగా ఉండిపోయాడు. ఆ పిల్లాడి నుంచి ఫోన్ నంబరు తీసుకుని తండ్రికి ఫోన్ చేయగా డెంగీతో బాధపడుతున్నట్లు తేలింది. ఆసుపత్రికి వెళ్లావా? అని అడిగితే లేదని చెప్పడం బాధనిపించింది. ఈ కుటుంబమే కాదు ఇలాంటి పేదలెందరో వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారని గ్రహించా. మా పార్టీ కార్యకర్తలతో చెప్పి ఆయనకు వైద్యసహాయం అందేలా చేశాను’ అని రాహుల్‌గాంధీ వివరించారు.