సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీంతో పాటు రాష్ట్ర ప్రజలకు మరిన్ని హామీలు కురిపించింది. సరిగ్గా మరో వారం రోజుల్లో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో ప్రధాన రాజకీయాలు పార్టీలు ప్రచారంలో బిజీబిజీగా ఉన్నాయి. ఈ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. తమ పార్టీని గెలిపిస్తే ప్రతి ఇంటికి రూ.300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చింది. దీంతోపాటు మహిళలకు ఆర్థికసాయం, స్టార్టప్ ఫండ్, లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానాలిచ్చింది. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ నేతృత్వంలో కాంగ్రెస్ ఈ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇది కేవలం మేనిఫెస్టో మాత్రమే కాదని, హిమాచల్ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం రూపొందించిన డాక్యుమెంట్ అని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ ధాని రామ్ శాండిల్ తెలిపారు. గత ఐదేళ్లలో బీజేపీ ప్రజల అంచనాలను చేరుకోలేకపోయిందని, ఎన్నికల హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆయన దుయ్యబట్టారు. నవంబర్ 12న రాష్ట్రంలో పోలింగ్ జరగనుంది.
కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ప్రధానాంశాలివే : ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. 18-60 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 ఆర్థిక సాయం. ప్రతి నియోజకవర్గానికి రూ.10కోట్ల చొప్పున రూ.680 కోట్లతో స్టార్టప్ ఫండ్. లక్ష ఉద్యోగాల కల్పన, జర్నలిస్టులకు పింఛను, పాత పింఛను విధానం. ట్యాక్సీ డ్రైవర్లకు అందుబాటు వడ్డీరేట్లతో రుణాలు,15 ఏళ్ల వరకు పర్మిట్.