నిర్మలా సీతారామన్‌ను కలిసి తెలంగాణ ఆర్థిక పరిస్థితిని వివరించిన రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డితో పాటు ఆర్థికమంత్రిని కలిసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్జీఎఫ్ కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.1,800 కోట్ల బకాయిలపై వినతిపత్రం
న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. దాదాపు గంటసేపు ఈ భేటీ జరిగింది. బ్యాక్వర్డ్ రీజియన్స్ గ్రాంట్ ఫండ్ (బీఆర్జీఎఫ్) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.1,800 కోట్ల బకాయిలపై వినతి పత్రం ఇచ్చారు. అదే సమయంలో పదిహేనో ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం తీవ్ర అప్పుల ఊబిలో కూరుకు పోయిందని కేంద్ర ఆర్థికమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రానికి తగిన ఆర్థిక సాయం చేయాలని కోరారు. కాగా నిర్మలా సీతారామన్‌తో భేటీ అనంతరం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు బయలుదేరారు. సీఎం, మంత్రి ఉత్తమ్ రెండు రోజుల పాటు ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు.
రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ : కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. ఏఐసీసీ నిర్వహించిన లోక్ సభ ఎన్నికల సన్నాహక భేటీలో పాల్గొనడానికి వచ్చిన రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు రెండు రోజులుగా వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశమవుతున్నారు. నిన్న అమిత్ షా, హర్దీప్ సింగ్ పూరీ, గజేంద్ర సింగ్ షెకావత్ తదితరులను కలిశారు. తాజాగా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. తెలంగాణలోని రక్షణ శాఖ భూములు, కంటోన్మెంట్ అంశాలపై చర్చించారు.