వేలచ్చేరి : చంద్రయాన్-3 మిషన్ కోసం ప్రాజెక్ట్ డైరెక్టర్
పి.వీరముత్తువేల్ తన సొంత ఇంటి సంతోషాల్ని కూడా వదులుకున్నారు. ఈ నెల 20న
జరిగిన చెల్లి పెళ్లికి కూడా వెళ్లలేకపోయారు. ఈ విషయాన్ని ఆయన తండ్రి
పి.పళనివేల్ ఆంగ్ల మీడియాతో పంచుకున్నారు. చంద్రునిపై దిగాల్సిన రష్యా
ల్యాండర్ కుప్పకూలిపోవడంతో ప్రపంచం దృష్టంతా భారత్కు చెందిన విక్రమ
ల్యాండర్ మీద పడింది. ఈ నెల 23న చంద్రుని దక్షిణ ధ్రువం మీద ఇది దిగాల్సి
ఉండగా ఆ మిషన్ పర్యవేక్షణలోనే నిమగ్నమయ్యారు వీరముత్తువేల్. చంద్రుని మీద
ల్యాండర్ విజయవంతంగా దిగగానే ఆయనతో పాటు సొంతూరు విళుపురంలోని కుటుంబీకులు,
బంధువులు, స్నేహితులు సంబరాలు చేసుకున్నారు. ఈ విషయమై విశ్రాంతి రైల్వే
ఉద్యోగి అయిన పి.పళనివేల్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ‘మిషన్
మొదలైనప్పటినుంచి వీరముత్తువేల్ ఇంటికి రాలేదు. చివరికి ఆగస్టు 20న చెల్లి
పెళ్లి ఉన్నా హాజరుకాలేదు. నా కుమారుడు చంద్రయాన్-3 ప్రాజెక్టులో
పనిచేసినందుకు గర్వపడుతున్నా’ అని తెలిపారు.