ఆగస్టు 23 సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయనున్న
విక్రమ్ ల్యాండర్
జాబిల్లిపై దిగడానికి రెండు గంటల ముందు అన్నీ సమీక్షిస్తామన్న ఇస్రో
పరిస్థితులు అనుకూలించకపోతే ఆగస్టు 27కు ల్యాండింగ్ తేదీ మారుస్తామన్న ఇస్రో
శాస్త్రవేత్త
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమయ్యేందుకు ఇస్రో పక్కా ప్రణాళిక వేసింది. రాబోయే
సమస్యలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చంద్రయాన్-3 ప్రయోగాన్ని డిజైన్
చేసింది. ఇక రష్యా ప్రయోగించిన లూనా-25 ల్యాండర్ చంద్రుడిపై చివరినిమిషంలో
కూలిపోయిన తరుణంలో ఇస్రో శాస్త్రవేత్త ఒకరు కీలక ప్రకటన చేశారు. ల్యాండర్
మాడ్యూల్‌కు సంబంధించి ప్రతికూలతలు తలెత్తితే ల్యాండింగ్ తేదీని మారుస్తామని
పేర్కొన్నారు. ఆగస్టు 27న విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కోసం
ప్రయత్నిస్తామన్నారు. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం ఆగస్టు 23 సాయంత్రం 6.04
గంటలకు జాబిల్లిపై విక్రమ్ దిగేందుకు ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే.
‘‘ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ దిగడానికి రెండు గంటల ముందు ఓసారి
అన్ని అంశాలను పరిశీలిస్తాం. ల్యాండర్ స్థితిగతులు, చంద్రుడిపై పరిస్థితులను
బేరీజు వేసుకున్నాకే దిగాలా? వద్దా? అనేది నిర్ణయిస్తాం. ఒకవేళ పరిస్థితులు
అనుకూలంగా లేకపోతే ఆగస్టు 24కు ల్యాండింగ్ తేదీని మారుస్తాం’’ అని ఇస్రో
శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. చంద్రయాన్-2 వైఫల్యంతో నేర్చుకున్న అనుభవాలను
మిళితం చేస్తూ చంద్రయాన్-3ని ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు. ప్రస్తుతం
చంద్రుడిపై దిగేందుకు అనువైన పరిస్థితుల కోసం విక్రమ్ ల్యాండర్ వేచిచూస్తోంది.