ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తర కాశీ జిల్లాలో గంగోత్రి వద్ద ఘోర ప్రమాదం
చోటుచేసుకుంది. ఓ బస్సు లోయలో పడిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. పలువురికి
తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంటనే సంఘటన
స్థలానికి చేరుకున్నారు. లోయలో పడిన బస్సు నుంచి, స్థానికుల సాయంతో 27 మంది
ప్రయాణికులను కాపాడారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ఉన్నట్టు గుర్తించారు.
బస్సు శకలాల కింద చిక్కుకున్న మరో ప్రయాణికుడిని కాపాడేందుకు పోలీసులు
తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా, ఆ బస్సు గుజరాత్ కు చెందిన భక్తులతో గంగోత్రి
నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్
సింగ్ ధామి వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. సహాయ చర్యలు వేగవంతం చేయాలని
ఆదేశించారు. బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్
సంతాపం తెలియజేశారు. ఈ ఘటన నేపథ్యంలో, తమ ప్రభుత్వం ఉత్తరాఖండ్ సర్కారుతో
ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోందని వెల్లడించారు.