చెన్నై : ఫార్ములా రేసింగ్ సర్క్యూట్ -2023 డిసెంబర్ 9, 10 తేదీల్లో
చెన్నైలో జరగనున్నట్లు రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి
ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్, సీఎంఆర్ఎల్,
తమిళనాడు క్రీడాభివృద్ధి కమిషన్, రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేటు లిమిటెడ్
సంయుక్తంగా భాతరదేశ మోటార్ స్పోర్ట్స్ రాజధాని అయిన చెన్నైలో ఫార్ములా
రేసింగ్ సర్క్యూట్ నిర్వహించనున్నాయి. ఈ పోటీ పరిచయ సమావేశం మంత్రి ఉదయనిధి
స్టాలిన్ నేతృత్వంలో జరిగింది. చెన్నై లీలా ప్యాలెస్‌లో జరిగిన ఈ
కార్యక్రమంలో మంత్రి ఉదయనిధి మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా రోడ్డు మార్గంలో
జరపనున్న అతిపెద్ద మోటార్ రేస్ ఇదేనని పేర్కొన్నారు. చెన్నై ఫార్ములా
రేసింగ్ సర్క్యూట్- ఎఫ్4 ఇండియన్ ఛాంపియన్షిప్, ఇండియన్ రేసింగ్
లీగ్‌లు చెన్నై ఐల్యాండ్ గ్రౌండ్స్ చుట్టూ 3.5 కి.మీకు రాత్రి పోటీగా
(స్ట్రీట్ సర్క్యూట్) జరపనుందన్నారు. ఈ ప్రత్యేకమైన రెండు ఛాంపియన్షిప్
పోటీల్లో భారతదేశంతో పాటు ఇతర దేశాల నుంచి పురుష, మహిళా క్రీడాకారులు
పాల్గొననున్నారని తెలిపారు. వీటి నిర్వహణకు రూ.42 కోట్లు కేటాయించినట్లు
పేర్కొన్నారు. అంతర్జాతీయ సర్ఫింగ్ పోటీలు కూడా మామల్లపురంలో జరగనున్నాయని
తెలిపారు. ఈ సందర్భంగా ఉదయనిధి సమక్షంలో తమిళనాడు క్రీడాభివృద్ధి కమిషన్,
ఫార్ములా రేస్ నిర్వాహకులు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో శాఖ
అదనపు ప్రధాన కార్యదర్శి అతుల్య మిశ్రా, క్రీడాభివృద్ధి కమిషన్ సభ్య
కార్యదర్శి మేఘనాథ్‌రెడ్డి, ఇండియా మోటార్ స్పోర్ట్స్ క్లబ్‌ల సమాఖ్య
అధ్యక్షుడు అక్బర్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.