న్యూఢిల్లీ : మధ్యవర్తిత్వం (మీడియేషన్) ద్వారా ప్రస్తుతం పెండింగ్లో ఉన్న
కోటికి పైగా కేసులు పరిష్కరించాలంటే ఈ వ్యవస్థను వందరెట్లు బలోపేతం చేయాల్సి
ఉంటుందని వైస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
మధ్యవర్తిత్వం బిల్లు 2021 బిల్లుపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన
పాల్గొంటూ దేశంలోని వివిధ కోర్టుల్లో నాలుగున్నర కోట్లకుపైగా కేసులు
పెండింగ్లో ఉంటే అందులో కోటికి పైగా సివిల్ కేసులేనని అన్నారు. దేశంలో 2022
నాటికి 570 మీడియేషన్ కేంద్రాలు, 16 వేల మంది మీడియేటర్లు ఉన్నారు.
పెండింగ్లో ఉన్న కోటికిపైగా సివిల్ కేసులలో 90 వేల కేసులను మాత్రమే
పరిష్కరించగల సామర్ధ్యం ప్రస్తుత మీడియేషన్ వ్యవస్థకు ఉంది. అంటే మొత్తం
కేసులలో కేవలం మీడియేషన్ ద్వారా కేవలం 1 శాతం కేసుల పరిష్కారానికి మాత్రమే
ఆస్కారం ఉందని ఆయన అన్నారు. ఈ నేపధ్యంలో బిల్లు చట్టరూపం దాలిస్తే తగినన్ని
మీడియేషన్ సెంటర్లు, మీడియేటర్లు లేనందున ఆ వ్యవస్థపై మోయలేనంత భారం
పడుతుంది. ఈ వ్యవస్థను వంద రేట్లకు పైగా బలోపేతం చేయకపోతే ఈ బిల్లు ప్రయోజనం
నెరవేరదని ఆయన అన్నారు.
ఈ బిల్లు ద్వారా మీడియేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను నెలకొల్పాలని
ప్రతిపాదించడం జరిగింది. మీడియా కౌన్సిల్లో న్యాయ సంబంధ విషయాలలో ప్రావీణ్యం
కలిగిన వారిని మాత్రమే నియమించాలని విజయసాయి రెడ్డి సూచించారు. కమ్యూనిటీ
మీడియేషన్ ఈ బిల్లులోని ప్రధాన అంశాలలో ఒకటి. సున్నితమైన రాజకీయ అంశాలు ఇమిడి
ఉండే కేసుల పరిష్కారం కమ్యూనిటీ మీడియేషన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని
అన్నారు.