న్యూఢిల్లీ : గత ఏడాది జూన్ నెల జీఎస్టీ వసూళ్ళతో పోల్చుకుంటే 2023 జూన్ నెలలో
జీఎస్టీ వసూళ్ళు 12% పెరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి
వెల్లడించారు. రాజ్యసభలో మంగళవారం విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి
రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. జీఎస్టీ కింద 2023 జూన్ నెలలో
రూ.161,497 కోట్లు వసూలైనట్లు మంత్రి తెలిపారు. ఒక్క నెలలో జీఎస్టీ మొత్తం
వసూలు రూ.1.6 కోట్లు అదిగమించడం జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇది
నాలుగోసారని అన్నారు. జీఎస్టీ వసూళ్లలో ప్రతి సంవత్సరం సాధిస్తున్న వృద్ధితో
అనుకూల ధోరణి కనిపిస్తోందని అన్నారు.
2021-22 ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో ప్రతి నెలా రూ.1,10,110 కోట్లు
సగటున జీఎస్టీ వసూళ్లుతో మొత్తం రూ.3,30,329 కోట్లు వసూళ్లు సాధించిందని
అన్నారు. అలాగే 2022-23లో మొదటి త్రైమాసికానికి ప్రతినెలా రూ.1,51,014కోట్లు
సరాసరి వసూళ్లతో మొత్తం రూ.4,53,041 కోట్లు వసూలు కాగా, 2023-24 మొదటి
త్రైమాసికానికి ప్రతి నెలా రూ.1,68,541 కోట్ల సరాసరి వసూళ్లతో మొత్తం
రూ.5,05,622 కోట్లు వసూలయ్యిందని అన్నారు. అలాగే 2021-22 మొదటి త్రైమాసికంలో
దిగుమతులపై ఐజీఎస్టీ కింద రూ.79,760 కోట్లు వసూలు కాగా, రూ.2,585 కోట్ల సెస్
వసూళ్లతో కలిపి రూ. 27,448 కోట్లు నెలసరి యావరేజ్‌తో మొత్తం రూ.82, 345 కోట్ల
వసూలైనట్లు తెలిపారు.
అలాగే తాత్కాలికంగా అనుమతించిన జీఎస్టీ నష్టపరిహారం కింద మొత్తం సొమ్మును
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేసిందని ఎలాంటి
బకాయిలు లేవని మంత్రి తెలిపారు.
పార్లమెంటులో చేసిన చట్టానికి లోబడి జీఎస్టీ యాక్ట్ ప్రకారం జీఎస్టీ అమలు
చేయడం ద్వారా మొదటి 5 సంవత్సరాలు 2017 జూన్ 1 నుండి 2022 జూన్ 30 వరకు
రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు ఏర్పడ్డ రెవెన్యూ నష్టాలను పూడ్చేందుకు
కేంద్రం నష్టపరిహారం చెల్లించిందని అన్నారు. ఈ చట్టం ప్రకారం రాష్ట్రాలకు
ఇవ్వాల్సిన నష్టపరిహారం ప్రతి రెండు నెలలకోసారి లెక్కించి విడుదల చేయాలని
అన్నారు.
అటల్ జ్యోతి కింద ఏపీలో 5500 సోలార్ వీధి లైట్లు
న్యూఢిల్లీ : అటల్ జ్యోతి యోజన పథకం ఫేజ్ II కింద ఆంధ్రప్రదేశ్‌లో
యాస్పిరేషనల్ జిల్లాలైన విజయనగరం, విశాఖపట్నంలలో 5500 సోలార్ వీధి లైట్లు
అమర్చినట్లు కేంద్ర విద్యుత్ శక్తి శాఖ సహాయ మంత్రి ఆర్కే సింగ్ వెల్లడించారు.
రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ
విషయం తెలిపారు. అటల్ జ్యోతి పథకం మొదటి ఫేజ్‌లో ఆమోదిత రాష్ట్రాల జాబితాలో
ఆంధ్రప్రదేశ్ లేదని అన్నారు. అనంతరం ఫేజ్ IIలో ఏపీలోని మొత్తం మూడు
యాస్పిరేషనల్ జిల్లాలు కూడా కవర్ చేయబడ్డాయని మంత్రి తెలిపారు. అయితే
విశాఖపట్నం, విజయనగరం జిల్లాల కలెక్టర్లు మొత్తం 5500 సోలార్ వీధి లైట్లు
ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయగా ఆయా జిల్లాల్లో సోలార్ వీధిలైట్లు
అమర్చినట్లు మంత్రి తెలిపారు.