కాశ్మీర్ : జమ్ముకశ్మీర్‌లో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. రెండు చోట్ల జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు తెలిపారు. మరో ముగ్గురు హైబ్రిడ్ ఉగ్రవాదులను పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన రెండు ఎన్కౌంటర్లలో నలుగురు ముష్కరులు హతమయ్యారు. మరో ముగ్గురిని ప్రాణాలతో పట్టుకున్నారు. పుల్వామా, అనంత్‌నాగ్ జిల్లాల్లో ఈ ఎదురుకాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. పుల్వామా ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు, అనంత్‌నాగ్ జిల్లాలో మరో ఉగ్రవాది హతమైనట్లు పోలీసులు, ఆర్మీ అధికారులు వెల్లడించారు. అలాగే, శ్రీనగర్, బుద్గాం జిల్లాల్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ సందర్భంగా లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు హైబ్రిడ్ ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పుల్వామాలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాలకు ఇది “పెద్ద విజయం” అని కశ్మీర్ అదనపు డీజీపీ విజయ్ కుమార్ పేర్కొన్నారు. పుల్వామాలో ఎన్కౌంటర్ మృతుల్లో ఇద్దరు విదేశీ ఉగ్రవాదులు, ఒక స్థానిక ఉగ్రవాది ఉన్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. మరణించిన స్థానిక ఉగ్రవాదిని ముఖ్తియార్ భట్‌గా గుర్తించారు.
వీరంతా ఓ సైనిక శిబిరంపైకి దాడికి వెళ్తున్నారని కశ్మీర్ అదనపు డీజీపీ తెలిపారు. వారిలో ముఖ్తార్ భట్ గతంలో ఓ సీఆర్పీఎఫ్ ఏఎస్ఐ, ఇద్దరు ఆర్పీఎఫ్ సిబ్బందిని చంపాడని చెప్పారు. అనేక ఉగ్రచర్యల్లో భాగమైన లష్కరే తొయిబాకు కమాండర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. వారి నుంచి ఒక ఏకే-74, ఏకే-56 రైఫిల్, ఒక పిస్టల్ స్వాధీనం చేసుకునట్లు ఆర్మీ తెలిపింది.మరోవైపు, అనంతనాగ్‌లోని బిజ్బెహర్లోని సెమ్‌థాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో సెర్చ్ ఆపరేషన్ కాస్త ఎన్‌కౌంటర్‌గా మారిందని డీజీపీ తెలిపారు. ఈ దాడిలో ఇప్పటికే ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ప్రస్తుతం ఇక్కడ ఎన్కౌంటర్ కొనసాగుతోంది.