18 రాష్ట్రాల్లో ఏర్పాటైన కేంద్రాలు
100.1 మెగా హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో ప్రసారం
సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్న మోడీ
న్యూఢిల్లీ : ఆలిండియా రేడియో దేశ వ్యాప్తంగా కొత్తగా 91 ఎఫ్ఎం రేడియో
ట్రాన్స్ మిటర్లను ఏర్పాటు చేసింది. వీటిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏకకాలంలో ప్రారంభించారు. 100 మెగా వాట్ల
సామర్థ్యంతో కూడిన ఈ ట్రాన్స్ మిటర్లు తెలంగాణలో నాలుగు ప్రాంతాల్లో ప్రారంభం
అయ్యాయి. సిర్పూర్, నల్లగొండ, దేవరకొండ, రామగుండంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ
ఎఫ్ ఎం ట్రాన్స్మిటర్లు 100.1 మెగా హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో అందుబాటులో
ఉంటాయి. ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మాట్లాడుతూ ఆలిండియా రేడియో ద్వారా
దేశవ్యాప్తంగా ఎఫ్ఎం సేవలను కల్పించే లక్ష్యంలో ఇది తొలి అడుగు అని చెప్పారు.
దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో 85 జిల్లాల్లో ఏర్పాటైన నూతన ట్రాన్స్
మిటర్లు అదనంగా 2 కోట్ల జనాభాకు రేడియో కనెక్టివిటీని పెంచుతాయన్నారు. ఇవి 35
వేల చదరపు కిలోమీటర్లను కవర్ చేస్తాయని తెలిపారు. దేశంలో సాంకేతిక విప్లవం
రేడియో కొత్త అవతారంలోకి మారేందుకు దోహదం చేసిందన్నారు. సాంకేతిక
పరిజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి
చేస్తోందని ప్రధాని అన్నారు.