వైరస్ ప్రభావం ఢిల్లీలోనే ఎక్కువ
63 వేలు దాటిన యాక్టివ్ కేసులు
మూడు రోజులుగా పది వేల లోపే నమోదైన డైలీ కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య బుధవారం మళ్లీ పెరిగింది.
రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన కొత్త కేసులు మరోమారు 10 వేలకు పైనే
నమోదయ్యాయి. గడిచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 10,542 మంది వైరస్ బారిన పడ్డారని
కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. ఇక దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల
సంఖ్య 63 వేలు దాటిందని వెల్లడించింది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే దేశ రాజధాని
ఢిల్లీలో కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, పాజిటివిటీ రేట్ 26.54
శాతానికి చేరిందని పేర్కొంది. ఢిల్లీలో సగటున రోజూ వెయ్యికి పైనే కొత్త కేసులు
నమోదవుతున్నాయని వివరించింది. మూడు రోజులుగా కరోనా కొత్త కేసులు పదివేల లోపే
నమోదయ్యాయి. ఆదివారంతో గడిచిన 24 గంటల్లో 7,633 మంది వైరస్ బారిన పడగా సోమవారం
9,111 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే కరోనా ప్రభావం తగ్గుతోందని
అధికారులు భావించారు. అయితే బుధవారం మరోమారు కేసులు 10 వేలు దాటడంపై
అధికారవర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.