పారిశ్రామికవేత్తలకు సీఎం ధైర్యం
గతంలో పేర్లు చెబితే భయపడే పరిస్థితి ఉండేదని వెల్లడి
ఇప్పుడు ఒక్క కర్ఫ్యూ లేదని స్పష్టీకరణ
ఉత్తరప్రదేశ్ : ఏ మాఫియా గ్యాంగ్ లేదా ఏ క్రిమినల్ కూడా మిమ్మల్ని
బెదిరించలేరని ఉత్తరప్రదేశ్ మఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పారిశ్రామికవేత్తలకు
ధైర్యం చెప్పారు. ఇటీవల గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ ను
ముగ్గురు వ్యక్తులు జర్నలిస్టుల ముసుగులో వచ్చి కాల్పులు జరిపి చంపిన విషయం
తెలిసిందే. దీంతో రాష్ట్ర శాంతిభద్రతలపై ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఈ
పరిస్థితుల్లో యోగి పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం నింపే ప్రయత్నం చేశారు.
లక్నో, హార్దోయి జిల్లాల్లో టెక్స్ టైల్ పార్కులకు సంబంధించి ఎంవోయులు
కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడారు. ‘ఇప్పుడు ప్రొఫెషనల్
క్రిమినల్స్ లేదా మాఫియా లీడర్లు ఫోన్ ద్వారా కూడా పారిశ్రామికవేత్తలను
బెదిరించలేరని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వాల హయాంలో ఉత్తరప్రదేశ్ లో
అల్లర్లు చోటు చేసుకునేవని, కొందరి పేర్లు చెబితేనే భయపడే పరిస్థితి అని,
ఇప్పుడు అలాంటిదేమీ లేదని చెప్పారు. 2012 నుండి 2017 మధ్య కాలంలో రాష్ట్రంలో
700కు పైగా అల్లర్లు చోటు చేసుకున్నాయని, 2017లో తాము అధికారంలోకి వచ్చిన
తర్వాత ఒక్కటీ లేదన్నారు. ఒక్కసారి కూడా కర్ఫ్యూ విధించలేదన్నారు. గత
ప్రభుత్వాల హయాంలో రాష్ట్ర గుర్తింపు సంక్షోభంలో ఉండేదన్నారు. ఇప్పుడు మాత్రం
నేరగాళ్లు, మాఫియాల ఉనికి సంక్షోభంలో పడిందని వ్యాఖ్యానించారు.