దేశంలో కోల్కతాతో పాటు వివిధ ప్రాంతాల్లో నవంబరు 8న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇటీవల పలుచోట్ల పాక్షిక సూర్యగ్రహణం కనిపించిన సంగతి తెలిసిందే.
కోల్కతా: దేశంలో కోల్కతాతో పాటు వివిధ ప్రాంతాల్లో నవంబరు 8న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇటీవల పలుచోట్ల పాక్షిక సూర్యగ్రహణం కనిపించిన సంగతి తెలిసిందే. అనంతరం పక్షం రోజుల్లో చంద్రగ్రహణం ఏర్పడుతున్నట్లు ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త దేవీప్రసాద్ దువారీ తెలిపారు. భారత్తో పాటు పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, రష్యా.. ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర, దక్షిణ అమెరికాలు.. ఉత్తర అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల్లోని వివిధ ప్రాంతాల్లో చంద్రగ్రహణం కనిపిస్తుందని వెల్లడించారు. కొన్ని లాటిన్ అమెరికా దేశాల్లో పాక్షిక చంద్రగ్రహణ ప్రారంభాన్ని వీక్షించగలుగుతారని చెప్పారు. చంద్రగ్రహణానికి సంబంధించిన దువారీ వెల్లడించిన వివరాలివి..
గ్రహణకాలం..:ప్రపంచవ్యాప్తంగా నవంబరు 8న ఏర్పడే పాక్షిక, సంపూర్ణ చంద్రగ్రహణ వేళలివే (భారత కాలమానం ప్రకారం)..
పాక్షికం: మధ్యాహ్నం 2.39 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.19 గంటలకు ముగుస్తుంది.
సంపూర్ణం: మధ్యాహ్నం 3.46 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 5.11 గంటలకు విడుస్తుంది. చంద్రుడు గరిష్ఠంగా చీకటిగా కనిపించే సమయం సాయంత్రం 4.29 గంటలు
* భారత్లో అన్ని ప్రాంతాల్లోనూ చంద్రోదయం సమయం నుంచి గ్రహణం కనిపిస్తుంది. అయితే గ్రహణ ప్రారంభం మాత్రం కనిపించదు. కోల్కతాతో పాటు తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణంగాను, మిగతా ప్రాంతాల్లో పాక్షికంగాను గ్రహణాన్ని వీక్షించవచ్చు. కోహిమా, అగర్తలా, గువాహటి వంటి నగరాల్లో కోల్కతా కంటే ముందుగానే సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. కోహిమాలో మాత్రమే చంద్రుడు గరిష్ఠంగా చీకటిలోకి వెళ్లడాన్ని చూడగలరు.